చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు | Not only the integrity of chandra babu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

Published Wed, Mar 4 2015 1:45 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు - Sakshi

చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

సాక్షి ప్రతినిధి, కడప: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాల పుట్ట. ఉత్తుత్తి వాగ్దానాలు చేస్తున్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. అవగాహన రాహిత్యంతో ఇష్టానుసారంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. జూలై నాటికి 35 టీఎంసీలు నీరు జీఎన్‌ఎస్‌ఎస్ ద్వారా తెస్తానని ప్రకటించారు. ప్రాజెక్టుల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఆ విషయం తొమ్మిదేళ్ల ఆయన గత పాలన తేటతెల్లం చేస్తోంది. క్షేత్ర స్థాయిలో వాస్తవ విషయాలు తెలుసుకుని జీఎన్‌ఎస్‌ఎస్ పథకానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. సత్వరమే యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులు చేపట్టాల’ని కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో మూడు రోజులుగా నిరవధికనిరహార దీక్ష చేస్తున్న ఆయన మంగళవారం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
 
 ఇప్పటి పరిస్థితిలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు జీఎన్‌ఎస్‌ఎస్‌కు కనీసమంటే రూ. 1600 కోట్లు అవసరమన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి గండి కోట వరకూ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఆ మేరకు ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించామన్నారు. జిల్లాకు జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాణప్రదమని, కమలాపురం నియోజకవర్గానికి అంత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని ఆయన వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు ఇలా..
 సాక్షి : గాలేరు-నగరిలో అంతర్భాగమైన గండికోటతోపాటు మైలవరం రిజర్వాయర్లుకు కలిపి జూలై నాటికి 35 టీఎంసీల నీరు ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి ప్రక టించినప్పటికీ మీరు దీక్ష చేయడానికి కారణం?
 
 ఎమ్మెల్యే: సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. ప్రాజెక్టులపట్ల అవగాహన అస్సల్లేదు. జూలై నాటికి అరకొరగా ఇవ్వచ్చు కానీ, 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తాననడం హాస్యాస్పదం. 1996, 1999 ఎన్నికలకు ముందు ఓకే ప్రాజెక్టుకు రెండుసార్లు శంకుస్థాపనలు చేసి ఆపై మిన్నకుండిపోయారు. తొమ్మిదేళ్ల కాలంలో రూ.19 కోట్లు కేటాయించారు. అది ఉద్యోగుల జీతాలకే సరిపోయింది. తట్టెడు మట్టి కూడా తీయని ఆయన ఇప్పుడు నీరు ఇస్తానని చెబుతున్నారు.
 
 యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులు చేస్తే ఒకటిన్నర్ర సంవత్సరాలకు తొలి దశ పనులు పూర్తి చేయవచ్చు. అందు కోసం రూ.1600 కోట్లు పైగా ఖర్చు చేయాల్సి ఉంది. ఆ మేరకు బడ్జెట్‌లో ఓకేసారి నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాను. క్షేత్ర స్థాయిలో స్వయంగా సహ చర ప్రజా ప్రతినిధులు, అఖిలపక్ష సభ్యులతో కలిసి పరిశీలించాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వం బడ్జెట్‌లో పూర్తి స్థాయి నిధులు కేటాయించి చిత్తశుద్ధిని ప్రదర్శించాలి.
 
 సాక్షి : ప్రభుత్వంపై బురద చల్లేందుకే దీక్ష చేపట్టారని టీడీపీ నాయకులు అంటున్నారు..
 ఎమ్మెల్యే: డ్వాక్రా మహిళలు, రైతుల రుణ మాఫీ అని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేశారు. ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టు పనులపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. ఆ కారణంగానే బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో నీటి వాటా కోల్పోయాం. తెలుగుగంగ పథకం పూర్తి కాకపోయినా పనులు చేశారు కాబట్టి నీటి వాటా దక్కింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆహ్వానిస్తాం. టీడీపీ నాయకులకు చిత్తశుద్ధి లేదు.. వాళ్ల నాయకుడికి అస్సల్లేదు. ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారు.
 సాక్షి : పట్టిసీమ ప్రాజెక్టు ఆరు నెలలల్లో నిర్మించి కృష్ణా డెల్టాకు ఎత్తిపోతల ద్వారా 80 టీఎంసీల నీరు ఇస్తాం. అక్కడ ఆదా చేసిన నీరు శ్రీశైలం ద్వారా రాయలసీమకు ఇస్తామని సీఎం అంటున్నారు..
 
 ఎమ్మెల్యే: రాయలసీమను మోసం చేసేందుకే పట్టిసీమ ప్రాజెక్టు. సీఎం చెబుతున్న మాట అధికారికంగా ఎక్కడైనా ఉందా? రూ.1300 కోట్లు పనులను 27 శాతం అధికంగా కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్నారు. కేవలం ప్రజాధనం దోచుకోవడం మినహా మరొకటి కాదు. నిజంగా ప్రభుత్వం నిజాయితీతో ఉంటే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని పట్టుబట్టాలి. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు కాబట్టి.. కేంద్ర ప్రభుత్వం 90 శాతం వాటాను భరిస్తుంది. మిగిలిన పది శాతం వాటా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. పోలవరం నిర్మిస్తే అక్కడ సద్వినియోగం అయిన 80టీఎంసీల నీటిలో ఎగువ రాష్ట్రాల వాటా 35 టీఎంసీలు పోతే, 45 టీఎంసీలు రాయలసీమకు సద్వినియోగం చేయవచ్చు. అటువంటి ఆలోచన చేయకుండా కమీషన్ల కోసమే కోట్లు దండుకోవాలనే ఉద్దేశంతోనే ‘పట్టిసీమ’ అంటున్నారు. భూసేకరణ చేయకుండానే ఆరు నెలల్లో ఆ ప్రాజెక్టును ఎలా నిర్మించగలరు?
 సాక్షి : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయింపుపై పూర్తి వివక్ష ప్రదర్శించింది. దానిపై ఆందోళన నిర్వహించే ఆలోచన ఉందా?
 ఎమ్మెల్యే: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావడంపై సంతోషించాం. రాయలసీమకు నీరు లభిస్తుందని ఆశించాం. కేంద్రప్రభుత్వం నిధుల కేటాయింపులో పూర్తిగా వివక్ష చూపింది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కొనసాగుతున్నందున మరింత ఒత్తిడి తేవాలి. పోలవరం నిర్మిస్తేనే కృష్ణా జలాలు రాయలసీమకు దక్కుతాయి. ఆ ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయడం కోసం పోరాటం చేసేందుకు ముందుంటాం.
 
 సాక్షి : నీరు-చెట్టు కార్యక్రమాన్ని పట్టిష్టంగా నిర్వహించి, మెట్ట ప్రాంతంలో కరువు రాకుండా బయపడేలా చేస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు..
 ఎమ్మెల్యే: నీరు-చెట్టు కేంద్ర ప్రభుత్వ పథకం. ఇందుకు రూ. 27 వేల కోట్ల నిధులు కేటాయిస్తోంది. చెరువులు అభివృద్ధి చేయడం, చెట్లను పెంచడం ముఖ్య ఉద్దేశం. చెరువుల్లోకి నీరు చేరితేనే కదా ఉపయోగం. ఈ నిధులను సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేయగలిగితే అంతకంటే అధికంగా ఉపయోగముంటుందని అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి అఖిలపక్షంగా కేంద్రానికి వివరించాలి. ఆ దిశగా ప్రభుత్వ చర్యలు ఉంటే సంతోషమే. నీరు-చెట్టు పథకం తెలుగు తమ్ముళ్ల జేబులు నింపడానికే.  
 సాక్షి : జీఎన్‌ఎస్‌ఎస్ పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకరిస్తారనే నమ్మకం ఉందా? ఉద్యమాలకు తలొగ్గుతారా?
 ఎమ్మెల్యే: జీఎన్‌ఎస్‌ఎస్ తొలిదశ పనులు పూర్తి అయితే కమలాపురం నియోజకవర్గంలోనే 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. భూగర్భ జలాలు పూర్తిగా పెరుగుతాయి. రాయలసీమ అభివృద్ధి పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. విభజన చట్టంలో ఉన్న ఉక్కు ప్యాకర్టీ ఊసే లేదు. ఉర్దూ యూనివర్సిటీ కడపకు ప్రకటించి, కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మంగంపేటలో చిన్నతరహా పరిశ్రమలు మూత పడేలా చేసి 20 వేల మంది కార్మికులు రోడ్డున పడేలా చేశారు. చంద్రబాబుకు తోలు మందం.. ప్రణాళిక బద్దంగా అఖిలపక్ష పోరాటాలకు సన్నద్ధం కానున్నాం. ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు అనుగుణంగా పాలన అందించేందుకు వైఎస్సార్‌సీపీ ముందంజలో నిలచి పోరాటాలు చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement