పొత్తు సీట్లపై అయోమయం
- సీట్లు ఖరారు చేయకుండా తాత్సారం
- వచ్చే సీటేదో... పోయే సీటేదో తెలియక నేతలు తికమక
సాక్షి, విజయవాడ : టీడీపీతో పొత్తు సీమాంధ్రలోని బీజేపీ నేతలకు తలనొప్పిలా మారింది. ఆదినుంచీ వారు పొత్తు వద్దని మొత్తుకున్నా జాతీయ నేతలు సిద్ధపడడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించారు. పొత్తులో భాగంగా సీమాంధ్రలోని ఐదు పార్లమెంట్, 15 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు తొలుత అంగీకరించినా.. ఇప్పుడు నాలుగు పార్లమెంట్, 15 అసెంబ్లీ స్థానాలకు బీజేపీని పరిమితం చేశారు.
ఈ మార్పుకు అనుగుణంగా బీజేపీకి ఇచ్చే సీట్లను ఖరారుచేయకుండా ఆ పార్టీ నేతలకు చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులు గడిచినా బాబు సీట్ల ప్రక్రియను తేల్చకపోవడంతో బీజేపీ నేతలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. చివరి నిమిషం వరకు ఇలా నాన్చితే అభ్యర్థులను వెదుక్కోవడం కూడా కష్టమవుతుందని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
పార్లమెంట్ అభ్యర్థులు వీరేనా..
తొలుత అరకు, విశాఖపట్నం, నర్సాపురం, తిరుపతి, రాజంపేట సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ ముందుకొచ్చినట్లు సమాచారం. తాజాగా వీటిలోనూ చంద్రబాబు మార్పులు చేశారు. అరకు స్థానాన్ని మార్పుచేసి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు తాజాగా టీడీపీ అంగీకరించింది. నర్సాపురం సీటు బదులుగా కాకినాడ ఎంపీ సీటు బీజేపీకి దక్కుతుంది. ఇక్కడినుంచి సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు పోటీచేయవచ్చు.
ఇక కడప జిల్లా రాజంపేట స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి రంగంలోకి దిగుతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె అక్కడినుంచి పోటీచేయడానికి అంగీకరించకపోతే రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలున్నాయి. విశాఖపట్నం ఎంపీ స్థానం కంభంపాటి హరిబాబుకే కేటాయించేందుకు పార్టీ వర్గాలు మొగ్గుచూపుతున్నాయి. తిరుపతి నుంచి బీజేపీ తరఫున పారిశ్రామికవేత్త బరిలో దిగే అవకాశాలున్నాయి. ఒంగోలు సీటు కోరినా దాన్ని కేటాయించకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. నర్సాపురం సీటును పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజుకు ఇవ్వాలని బీజేపీ భావించింది. ఇప్పుడా సీటు మార్పుచేసి కాకినాడ ఇవ్వడంతో బీజేపీలో ఒక వర్గం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
అసెంబ్లీ సీట్ల పరిస్థితీ అంతే..
పదిహేను అసెంబ్లీ సీట్ల విషయంలోనూ బీజేపీకి ఇంకా స్పష్టత రాలేదు. ఆయా స్థానాల్లో ఆ పార్టీకి ఇంకా అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొంది. ఇక్కడ బీజేపీకి మూడు శాతం కంటే తక్కువ ఓటింగే ఉంది. ఇప్పటికే ఇస్తారని భావిస్తున్న సీట్లలో విజయవాడ సెంట్రల్, నరసరావుపేట, నర్సన్నపేట వంటి సీట్లు మార్చుతారంటూ ప్రచారం జరుగుతోంది. సెంట్రల్ సీటుకు బదులు వెస్ట్ సీటు బీజేపీకి ఇస్తే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలంపల్లి దూకేసి బీ-ఫారం తెచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. నరసరావుపేటలో ఒక పారిశ్రామికవేత్తకు బీజేపీ సీటు లభించే అవకాశం ఉందని తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకు సమర్ధుడైన అభ్యర్థి కమలనాథులకు దొరకలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.