సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు రకాల స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మూడు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శనివారం ప్రకటించారు. తొలిదశలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలన్నింటికీ ఒకే విడతలో ఈ నెల 21న.. రెండో దశలో 23న మున్సిపల్ ఎన్నికలు.. మూడో దశలో గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలు 27, 29 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే అమలులోకి వస్తుందని.. మున్సిపల్ ఎన్నికలకు 9న, గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెండు విడతలుగా 15, 17 తేదీల్లో నోటిఫికేషన్‌ను వేర్వేరుగా విడుదల చేస్తామని రమేష్‌కుమార్ తెలిపారు. ఎన్నికల నియమావలి కూడా తక్షణమే అమలులోకి వస్తుందని అన్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రేపటి నుంచే నామినేషన్లు
ఈ నెల 9 నుంచి 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
– ఎంపీటీసీ స్థానాలకు సంబంధిత మండల పరిషత్ కార్యాలయంలో.. జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు.
– రాష్ట్రంలో ఉన్న మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలకు.. అలాగే, 10,047 ఎంపీటీసీ స్థానాలుండగా వీటిలో 9,984కు ఒకే విడతలో ఈనెల 21వ తేదీ ఉ.7గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
– తూర్పు గోదావరి జిల్లా ఏటిపాక ఎంపీపీ పదవీకాలం 2021 జూన్ 28 వరకు ఉండడంతో అక్కడ ఎంపీటీసీ, ఎంపీపీ ఎన్నికలు జరగడంలేదు.
– దీనితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68 ఎంపీటీసీ స్థానాలల్లో వివిధ కారణాల రీత్యా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా నిలుపుదల చేసింది.
– ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ 24న జరుగుతుంది.
– ఎంపీటీసీలకు పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,500, జనరల్ అభ్యర్థులు రూ.3వేలు.. అదే జెడ్పీటీసీలకు పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.3వేలు, జనరల్ అభ్యర్థులు రూ.6వేలు డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుంది.
– అలాగే, జెడ్పీటీసీగా పోటీచేసే అభ్యర్థి గరిష్ట వ్యయ పరిమితి రూ.4లక్షలు కాగా.. ఎంపీటీసీ అభ్యర్థిది రూ.2లక్షలు.
మున్సి‘పోల్స్’ 23న..
రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెలువరించిన షెడ్యూల్ ప్రకారం పట్టణ, నగర పాలక సంస్థలకు కూడా ఒకే విడతలో ఈ నెల 23న ఎన్నికలు జరుగుతాయి. ఇందుకు 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 27న కౌంటింగ్ జరుగుతుంది. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నిక ఎక్కడికక్కడ ఈ నెల 31న జరుగుతుంది.
సర్పంచి ఎన్నికలు రెండు విడతల్లో..
ఇక తొలి విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు 17–19 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడతలో జరిగే వాటికి 19–21 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. ఇటీవల పలు పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం అనంతరం రాష్ట్రంలో దాదాపు 13,377 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తొలి దశలో ఏ గ్రామాలకు, రెండో దశలో ఏ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలన్న దానిపై పూర్తి అధికారాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లా కలెక్టర్లకే అప్పగించింది. అయితే, ఒక మండలంలో గ్రామ పంచాయతీలన్నింటికీ ఒకే దశలో ఎన్నికల జరపాలని, సమస్యాత్మక గ్రామ పంచాయతీలకు రెండో దశలో ఎన్నికలు జరుపుకోవాలని కమిషన్ సూచించింది. కాగా, దాదాపు 140కి పైగా గ్రామాల్లో వివిధ కారణాలతో ఎన్నికలను నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ వెల్లడించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొలింగ్ నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు మ.2 గంటల నుంచి కౌంటింగ్ చేపడతారు.
పరోక్ష పద్ధతిలో..
– గెలుపొందిన ఎంపీటీసీలు ఈనెల 30న మండలాల వారీగా ఎక్కడికక్కడ మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ), ఉపాధ్యక్షుడు, కోఆప్షన్ సభ్యులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. అలాగే, జిల్లాల వారీగా ఎన్నికైన జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్‌ను కూడా అదేరోజు ఇదే పద్ధతిలో ఎన్నుకుంటారు.
– మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికైన కౌన్సిలర్లు కూడా పరోక్ష పద్ధతిలోనే మేయర్, డిప్యూటీ మేయర్.. చైర్మన్, వైస్‌చైర్మన్లను ఈనెల 31న ఎన్నుకుంటారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తీరు తెన్నులు...
గ్రామీణ ప్రాంతంలో మొత్తం ఓటర్లు : 2,82,15,104
పోలింగ్ కేంద్రాలు : 33,663
సమస్యాత్మకమైనవి : 10,487
అత్యంత సమస్యాత్మకమైనవి : 11,251
సాధారణ పొలింగ్ కేంద్రాలు : 11, 925
ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది : 2,01,978
ఎన్నికల పరిశీలకులు : 15 మంది ఐఏఎస్ అధికారులు
వ్యయ పరిశీలకులు : 15 మంది ఐఏఎస్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment