పార్టీలో గజదొంగల చేరికతో బాధేస్తోంది
* పార్టీలో గజదొంగల చేరికతో బాధేస్తోంది
* ఇతరుల తప్పులు ఎలా వేలెత్తి చూపగలం?
* టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నవ్యాఖ్య
నర్సీపట్నం : క్రమశిక్షణ గల టీడీపీ లోకి గజదొంగల చేరికతో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం అ య్యన్న కాలనీలో ఇంటాంటా టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ సమాజంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన స్థాపించిన పార్టీలోకి దొంగలు రావడం తనను బాధిస్తోందని వ్యాఖ్యానించారు.
గజదొంగల చేరికతో ఎదుటివారి తప్పులను వేలెత్తి చూపే ఆస్కారం పార్టీ నాయకులకు ఉండదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ముత్యాలపాప తీరును విమర్శిస్తూ, ఆమె అభివృద్ధిని మరిచారని విమర్శించారు. ఎన్నికలకు రెండు నెలలే సమయం ఉన్నందున కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రజలను అష్టకష్టాలకు గురిచేసిన కాంగ్రెస్‌ను సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల సన్యాసిపాత్రుడు, అయ్యన్నయూత్ అధ్యక్షుడు విజయ్ పాల్గొన్నారు.
అయ్యన్నను కలిసిన వెలగపూడి
విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అయ్యన్నపాత్రుడిని శుక్రవారం కలిశారు. అయ్యన్న ఇంటిలో ఇద్దరూ కొద్దిసేపు సంభాషించారు. అయ్యన్నను కలిసినవారిలో జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్లు పైల ముత్యాలనాయుడు, పట్టాభిరాము, అడవివరం సర్పంచ్ పాసర్ల ప్రసాద్ ఉన్నారు.