మాట్లాడుతున్న కలెక్టర్ బి.లక్ష్మీకాంతం
విజయవాడ: మాతా శిశు మరణాలు నమోదు లేకుండా, వ్యాధి నిరోధక టీకాలు నూరుశాతం నిర్వహించిన జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలోని సూర్యారావుపేట ఐవీ ప్యాలెస్‌లో శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించి జీరోకి తీసుకురావాలన్నారు. ఇమ్యూనైజేషన్ కార్యక్రమం నూరుశాతం జరగాలన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహిం చాలన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయని వాటిని మెరుగుపచ్చుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లులో కనీస అవసరాలను సమకూర్చుకోవడం, మరమ్మతులు వంటి పనులను ఆస్పత్రి అభివృద్ధి నిధులను ఖర్చుచేసుకోవాలని సూచించారు.
నిధుల సమీకరణకై అమెరికా పర్యటన
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి మోడల్‌గా అభివృద్ధి చేసే నేపథ్యంలో ప్రవాసాంధ్రులు రూ.6కోట్లు విరాళంగా అందించారని, మరిన్ని నిధుల సమీకరణకు తానా ఆహ్వానంపై జూన్‌లో అమెరికాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇంటిపన్ను వసూలు లక్ష్యం రూ.50కోట్లు
జిల్లాలో 970 గ్రామ పంచాయతీల్లో రూ.50 కోట్లు ఇంటిపన్ను వసూలు మార్చి ఆఖరునాటికి పూర్తిచేయాలన్నారు. మాస్ క్లీనింగ్ డేను స్పెషల్ డ్రైవ్‌గా నిర్వహించాలన్నారు. శానిటేషన్ మెరుగుపర్చాలని, తాగునీటి పైపులైన్లు మురుగునీటిలో కలువకుండా పరిశీలించాలన్నారు. బ్లీచింగ్, క్లోరినైజేషన్ నిర్వహించాలన్నారు.
విజయవంతంగా కుష్ఠువ్యాధిపై అవగాహన
జిల్లాలో 15రోజులపాటు నిర్వహించిన కుష్ఠువ్యాధి అవగాహన కార్యక్రమం విజయవంతం చేయడంపై జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అభినందించారు. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వరకు జిల్లావ్యాప్తంగా కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమం వివరాలతో కూడిన పుస్తకాన్ని నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో 63 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపారు. 455 మంది వ్యాధిగ్రస్తులకు శారీరక వైఫల్యాలను గుర్తించి మైక్రో సెల్యూలర్ రబ్బర్(యం.సి.ఆర్)తో చేసిన చెప్పులు, సెల్ప్ కేర్ కిట్స్ అందించనున్నామన్నారు. ఆవిష్కరణలో అదనపు వైద్య ఆరోగ్య శా«ఖాధికారి డాక్టర్ టి.వి.ఎస్.ఎన్.శాస్త్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment