
సాక్షి, అమరావతి: ఇకపై మున్సిపాలిటీల్లో జరిగే అభివృద్ధి పనుల్ని డ్రోన్‌ల నుంచి తీసుకునే ఫుటేజీల ద్వారానే తెలుసుకుంటామని, దీన్నిబట్టే మున్సిపాలిటీలకు ర్యాంకులు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. బుధవారం ఆయన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి నాటికి డ్రోన్‌లను అందించాలని, డ్రోన్ నుంచి 3 వేల చదరపు కిలోమీటర్ల మేరకు ఫుటేజీలు తీసి పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వచ్చే మార్చి 15 నాటికి మున్సిపాలిటీలకు 200 డ్రోన్‌లను అందించాలని ఆదేశించారు.
డిసెంబర్ నాటికి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, ఈ పనుల్ని షాపూర్‌జీ పల్లోంజీకి అప్పగించినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలో 444 కిలోమీటర్ల మేరకు పెద్ద, చిన్నతరహా డ్రైన్‌లను నిర్మించేందుకు ఎల్‌అండ్‌టీకి పనులప్పగించామని, ఇవి నవంబర్ 1లోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెలగపూడిలోని సచివాయంలో స్మార్ట్ సైకిళ్ల సవారీని సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని మాస్టర్‌ప్లాన్ ప్రకారం సీఆర్‌డీఏ పరిధిలో సైకిల్ సవారీకి ప్రత్యేకంగా ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.