కీచక గురువు
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తన సెల్‌ఫోన్లు, వీడియో చిత్రీకరణ
నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నానంటూ వేధింపులు
నిలదీసిన సర్పంచ్, బాధితురాలి బంధువులు
నక్కపల్లి: విద్యార్థిని వేధిస్తున్న ఉపాధ్యాయుడిని ఆమె బంధువులు, గ్రామస్తులు నిలదీశారు. మండలంలోని జానకయ్యపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలావున్నాయి. ఇదే స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న చినతీనార్లకు చెందిన బాలికపై ఇదే పాఠశాలకు చెందిన ఇంగ్లీష్ టీచర్ ఈశ్వరరావు కొద్దికాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. సెల్‌ఫోన్‌తో ఫొటో లు, వీడియోలు తీస్తూ నువ్వంటే నాకు ఇష్టమని చూడకుండా ఉండలేకపోతున్నానంటూ ఇబ్బంది పెడుతున్నాడు. ఉపాధ్యాయుడు కావడంతో భయపడి ఈవిషయాన్ని ఆమె ఎవరికి చెప్పలేదు. ఇతని చేష్టలు రోజురోజుకు శ్రుతిమించిపోతున్నాయి. నిన్ను చూస్తూ బైక్ నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నానని చెప్పేవాడు. అతని బర్త్‌డే కేక్‌పై బాలిక ఫొటోను డిజైన్ చేశాడని వేధిస్తున్నాడని విద్యార్థిని కన్నీటిపర్యంతమైంది. వేధిస్తాడన్న భయంతోనే ఈ విషయం ఎవరికీ చెప్పలేదని ఆమె వాపోయింది. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఆమె తండ్రి వేట నిమిత్తం పూరీ వెళ్లాడు. ఆమె తల్లి వద్ద ఉంటోంది. విద్యార్థిని వేధింపుల విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఎరిపల్లి శ్రీను, పెదతీనార్ల సర్పంచ్ కొర్లయ్య, గ్రామ నాయకులు ముసలయ్య తదితరులు పాఠశాలకు వెళ్లి వేధిస్తున్న ఉపాధ్యాయుడిని నిలదీశారు.
విద్యాబుద్ధులు నేర్పుతూ కన్నపిల్లలా చూడాల్సింది పోయి ఇలా దుర్బుద్ధితో ప్రవర్తించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి బాగా చదువుతుందని దానివల్ల నువ్వంటే నాకిష్టమని చెప్పానని అంతే తప్ప మరో ఉద్దేశం లేదని ఉపాధ్యాయుడు చెబుతున్నాడు. ఫోటోలు, వీడియోలు ఎందుకు తీశారని ప్రశ్నిస్తే పాఠశాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమం సందర్భంగా తీశానని తెలిపాడు. ఇలా చేయడం తప్పేనని ఒప్పుకున్నాడు. పాఠశాల హెచ్‌ఎం నూకరాజుతోపాటు, గ్రామస్తులు అతనిని మందలించారు. అయితే బాదితురాలు మాత్రం ఈశ్వరరావు ఈ పాఠశాలలో పనిచేస్తే తాను ఇక్కడ చదవనని చెబుతోంది. ఇటువంటి సమస్య మరే ఆడపిల్లకు రాకూడదని తక్షణమే సదరు ఉపాధ్యాయుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.