49 పోస్టులు నొక్కేశారు | Officals try to fraud in 49 ICDS superviser posts | Sakshi
Sakshi News home page

49 పోస్టులు నొక్కేశారు

Published Thu, Nov 14 2013 4:14 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

Officals try to fraud in 49 ICDS superviser posts

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అన్నట్టుగా మారింది ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ వ్యవహారం. తగినన్ని మార్కులు రాకపోయినా పోస్టులు బ్లాక్‌లో పెట్టిమరీ అస్మదీయులతో భర్తీ చేయాలన్నట్లుగా ఉంది ఉన్నతాధికారుల తీరు. ప్రకాశం రీజియన్ పరిధిలో ఏకంగా 49 పోస్టులను భర్తీ చేయకుండా అట్టిపెట్టడమే ఇందుకు తార్కాణం. అదే విధంగా అర్హులైన వికలాంగ అభ్యర్థులకూ అధికారులు అన్యాయం చేశారు. అర్హులైన అంగన్‌వాడీ కార్యకర్తలకు మొండిచెయ్యిచూపుతూ ఉన్నతాధికారులు తీసుకున్న ఈ నిర్ణయం సందేహాస్పదంగా మారింది. సూపర్‌వైజర్‌పోస్టుల కోసం 8 ఏళ్లుగా నిరీక్షించిన అర్హులకు నిరాశ మిగిల్చుతూ ఉన్నతాధికారులు చేసిన మాయాజాలం ఇది...
 
 ప్రకాశం రీజియన్ పరిధిలో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 302 ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అక్టోబరు 27న రాత పరీక్ష నిర్వహించారు. దాదాపు 8 ఏళ్ల తరువాత సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడంతో అర్హులైన అభ్యర్థులు భారీగా పోటీ పడ్డారు. మొత్తం 3,887మంది దరఖాస్తు చేసుకోగా... 3,572 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. వీరిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న గ్రేడ్-2 కాంట్రాక్టు సూపర్‌వైజర్లు 183 మంది. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇన్‌స్ట్రక్టర్లు రాత పరీక్ష రాశారు. నాలుగు రోజుల్లోనే రాత పరీక్ష ఫలితాలు ప్రకటించారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సూపర్‌వైజర్లకు 15 శాతం, ఇన్‌స్ట్రక్టర్లకు 5 శాతం గ్రేస్‌మార్కులు కేటాయించారు. దీన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు.దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఉన్నతాధికారులు అదేమీ పట్టించుకోలేదు.
 
 248 పోస్టులే భర్తీ ...
 రాత పరీక్ష ఫలితాల ఆధారంగా సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టారు. రిజర్వేషన్లవారీగా కట్ ఆఫ్ మార్కును నిర్ణయించారు. ఓసీ-32.75, బీసీ ఏ - 28.12, బీసీ బీ - 28.00, బీసీ సీ - 30.12, బీసీ డీ - 28.00, ఎస్సీ - 28.37, ఎస్టీ - 24.37 కటాఫ్ మర్కులుగా నిర్ధారించారు. ఆ ప్రకారం అన్ని కేటగిరీలకు కలుపుకుని 248 మంది అభ్యర్థులే అర్హత సాధించారని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆ మేరకు పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. వికలాంగుల కోటాలో 5 పోస్టులు బ్యాక్‌లాగ్‌లో ఉంచారు. మిగిలిన 49 పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు.
 
 ఆ 49 పోస్టుల సంగతేమిటో! ...
 ఆ 49 పోస్టులు భర్తీ చేయకుండా అట్టిపెట్డడం వెనుక పెద్ద పన్నాగమే ఉంది. ఉన్నతాధికారులు తమ ఇష్టానుసారం కటాఫ్ మార్కులు నిర్ణయించేశారు. కొన్ని పోస్టులను భర్తీ చేయకుండా తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు వీలుగా కటాఫ్ మార్కులను నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ ప్రకారం 49 పోస్టులను భర్తీ చేయకుండా అట్టిపెట్టారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు నిబంధనలను తుంగలో తొక్కారు. రాత పరీక్ష మార్కుల ప్రకారం అందుబాటులో ఉన్న అభ్యర్థులతో భర్తీ చేసేలా కటాఫ్ మార్కును నిర్ణయించలేదు. తద్వారా 49 పోస్టులను భర్తీ చేయకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 49 పోస్టులు మిగులుతున్నప్పుడు కటాఫ్ మార్కులను తగ్గించవచ్చు. తద్వారా ఆ పోస్టులు భర్తీ చేయవచ్చు. 25, 26, 27 మార్కుల చొప్పున వచ్చిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. కటాఫ్ మార్కులు తగ్గిస్తే వారికి అవకాశం వచ్చేది. అలా కటాఫ్ మార్కులు తగ్గిస్తే అంగన్‌వాడీ కార్యకర్తలు అర్హత సాధిస్తారు. ఎనిమిదేళ్లుగా ఎదురుచూసిన చాలామంది అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇదే చివరి అవకాశం. సూపర్‌వైజర్‌పోస్టుల కోసం వయోపరిమితి 45 ఏళ్లుగా నిర్ణయించారు. పోస్టుల భర్తీ మళ్లీ ఎప్పుడు చేపడతారో తెలీదు. అప్పటికి 45 ఏళ్ల వయో పరిమితి దాటిపోయి చాలామంది అంగన్‌వాడీ కార్యకర్తలు అవకాశం కోల్పోతారు. కానీ ఉన్నతాధికారులు అలా చేయలేదు. ఎందుకంటే...
 
 అస్మదీయుల కోసం పన్నాగం...
 ఆ 49 పోస్టులు భర్తీ చేయకుండా ఉంచడం వెనుక పెద్ద కథే ఉంది. హైదరాబాద్‌లోని కమిషనరేట్ నుంచి ఒంగోలు వరకు ఉన్నతాధికారులు ఇందులో పాత్రధారులు, సూత్రధారులుగా వ్యవహారం నడిపారు. అంతా పద్ధతి ప్రకారం పోస్టులు భర్తీ చేసేస్తే తమ సంగతేమిటన్నది ఉన్నతాధికారుల ఉద్దేశంగా మారింది. అందుకే ఆ పోస్టులను ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షలో అర్హత సాధించని కాంట్రాక్టు సూపర్‌వైజర్లతో భర్తీ చేయాలని మాస్టర్‌ప్లాన్ వేశారు. అసలు కాంట్రాక్టు సూపర్‌వైజర్లతోనే పోస్టులు భర్తీ చేయాలనుకుంటే సాధారణ అంగన్‌వాడీ కార్యకర్తలను రాత పరీక్షకు అనుమతించడం ఎందుకు? కానీ ఉన్నతాధికారులు అవేమీ పట్టించుకోవడం లేదు. పోస్టుకు ఇంతని చొప్పున జేబులు నింపుకోవాలన్నదే లక్ష్యంగా మారింది. ఆ పోస్టులను దశలవారీగా తమ అస్మదీయులతో భర్తీ చేయాలని భావిస్తున్నారు. అలా గుట్టుచప్పుడు కాకుండా ఒక్కో పోస్టు భర్తీ చేసుకుంటూ వెళ్లాలన్నది వారి వ్యూహం. అందుకే కటాఫ్ మార్కులు తగ్గించి తమకు న్యాయం చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు కోరుతున్నా పట్టించుకోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement