ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఐసీడీఎస్ రెగ్యులర్ సూపర్‌వైజర్ గ్రేడ్-2 రాత పరీక్షల్లో నిబంధనలకు నీళ్లొదిలారు. సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే పెద్ద ఎత్తున పైరవీలు సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. దానికి అనుగుణంగానే ఆదివారం ఒంగోలులో నిర్వహించిన రాత పరీక్షలో నిబంధనలు పక్కన పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. జంబ్లింగ్ విధానానికి తిలోదకాలు ఇచ్చేశారు. కాంట్రాక్టు సూపర్‌వైజర్లందరినీ ఒక బ్లాక్ కేటాయించడం, అంగన్‌వాడీ కార్యకర్తలందరికీ మరో బ్లాక్ కేటాయించడం చర్చనీయాంశమైంది. రాత పరీక్షల్లో జరుగుతున్న తీరును నిరసిస్తూ కొంతమంది అంగన్‌వాడీలు పరీక్ష కేంద్రాల్లోనే నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను కలిసి అక్రమాలపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కోర్టును ఆశ్రయించేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో సూపర్‌వైజర్ పోస్టులకు జరిగిన రాత పరీక్ష వివాదాస్పదమైంది.
మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలో సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఏడాది జులై 2వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో 305 పోస్టులకు గాను 3887 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగులంతా నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో సూపర్‌వైజర్ పోస్టుల రాత పరీక్ష వాయిదా వేశారు.
ఈనెల 18వ తేదీ నుంచి సమ్మె విరమించి ఉద్యోగులంతా విధులకు హాజరయ్యారు. మూడు రోజులు తిరగకముందే సూపర్‌వైజర్ పోస్టుల రాత పరీక్షలకు హడావుడిగా తేదీ ప్రకటించడం చర్చనీయాంశమైంది. కీలకమైన విషయాలన్నింటిని పక్కనపెట్టి రాతపరీక్ష నిర్వహించడంపై పలువురు పెదవి విరిచారు. అందుకు కారణం లేకపోలేదు. మహిళా శిశు సంక్షేమ శాఖలో రెగ్యులర్ సూపర్‌వైజర్ పోస్టులు భర్తీచేసి కొన్నేళ్లవుతోంది. తొలిసారిగా 1996-1997 మధ్య కాలంలో సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేశారు. ఆ తర్వాత 2006లో కాంట్రాక్టు సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేశారు. అనంతరం సూపర్‌వైజర్ల పోస్టుల భర్తీ మాటే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో పెద్దఎత్తున పైరవీలు సాగాయి.
ఒక్కో పోస్టుకు రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు బేరం కుదుర్చుకున్నట్లు ప్రచారం సాగింది. ఇందుకు హైదరాబాద్‌లోని ైడెరైక్టరేట్ కార్యాలయం నుంచే లింక్ పెట్టుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. ప్రకాశం రీజియన్ పరిధిలో కాంట్రాక్టు పద్ధతిలో గ్రేడ్-1 సూపర్‌వైజర్లుగా ముగ్గురు, గ్రేడ్-2 సూపర్‌వైజర్లుగా 182మంది, ఇన్‌స్ట్రక్టర్లుగా 18మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు అర్హులైన అంగన్‌వాడీ కార్యకర్తలు కూడా రెగ్యులర్ సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. కాంట్రాక్టు సూపర్‌వైజర్లకు 15గ్రేస్ మార్కులు కలవడంతో వారిలో ఆశలు చిగురించాయి. వారి ఆశను కొంతమంది చక్కగా క్యాష్ చేసుకున్నారు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారికి ఒక రేట్, ఎక్కువ సర్వీసు ఉన్నవారికి మరో రేట్ నిర్ణయించి డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతిభ, రోస్టర్ ఆధారం చేసుకుని అభ్యర్థుల ఎంపిక జరగనుండటంతో ఇప్పటికే డబ్బులు ముట్టచెప్పినవారు హైదరాబాద్ స్థాయిలో తమ పనిని చక్కదిద్దుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అన్నీ అనుమానాలే..?
Published Mon, Oct 28 2013 6:47 AM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM
Advertisement