హెలెన్ వెళ్లినా.. | Officers need to be careful News | Sakshi
Sakshi News home page

హెలెన్ వెళ్లినా..

Published Fri, Nov 22 2013 4:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM

Officers need to be careful News

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : హెలెన్ తుఫాన్ హడలెత్తిస్తోంది. గంటల వ్యవధిలో రకరకాల మలుపులు తిరుగుతూ జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒంగోలులో తీరం దాటుతుందన్న హెచ్చరికలు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ తరువాత దిశ మార్చుకుని గురువారం రాత్రికి మచిలీపట్నం వద్ద కేంద్రీకృతమైంది. శుక్రవారం ఉదయానికి అక్కడ తీరం దాటుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. నెల్లూరులో హెలికాప్టర్‌ను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. అత్యవసర పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించుకునే వీలుంది. జాతీయ విపత్తుల నివారణ సంస్థ 80 మంది ప్రత్యేక సిబ్బందిని జిల్లాకు పంపించింది. ఒంగోలులో 40 మంది, సింగరాయకొండలో 40 మంది సిద్ధంగా ఉన్నారు. జిల్లాకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్‌తో సమావేశమై ఏర్పాట్లను పరిశీలించారు.
 
 రెండు రోజుల నుంచి హెలెన్ హెచ్చరికలు తీవ్రంగా ఉండటంతో ఏ క్షణంలో ఎటు నుంచి ముంచు కొస్తుందోనని ప్రజలతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. పై-లీన్ తుఫాన్ ముప్పు తప్పినప్పటికీ ఆ తరువాత వచ్చిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. తొమ్మిది మంది ప్రాణాలు నీటిలో కలిసిపోగా వందల కోట్ల రూపాయల మేర నష్టం సంభవించింది. భారీ వర్షాల నుంచి తేరుకోకముందే హెలెన్ హెచ్చరికలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో తీర ప్రాంత మండలాల్లో నివసించేవారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా చెట్లు నేలకొరగడం, ఇంటి పైకప్పులు  ఎగిరిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఒంగోలు, నాగులుప్పలపాడు, చినగంజాం, వేటపాలెం, చీరాల, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, జరుగుమల్లి, గుడ్లూరు మండలాల్లో జిల్లా స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని ఏ సమయంలోనైనా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా లారీలను సిద్ధం చేశారు. తీర ప్రాంతాల్లోని మండలాల్లో 28 గ్రామాలపై తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 46 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 58 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో బియ్యం, కందిపప్పు, కిరోసిన్ సిద్ధంగా ఉంచారు.
 
 సెలవులు రద్దు
 హెలెన్ తుఫాన్ హెచ్చరికలు రావడంతో జిల్లాలోని అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తూ కలెక్టర్ విజయకుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించలేక పోవడంతో అధికారులు, సిబ్బంది సేవలను వినియోగించుకునేందుకు వీలుగా సెలవులను రద్దు చేశారు. గ్రామ, మండల స్థాయిలో అధికారలు, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తుఫాన్ ముప్పు తప్పే వరకూ కేటాయించిన ప్రాంతాల్లో బృందాలు సంచరిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
 
 మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి
 మత్స్యకారులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. వేటకు వెళ్లిన వారిని తిరిగి రావాలంటూ ఇప్పటికే సూచించడంతో దాదాపుగా మత్స్యకారులంతా ఒడ్డుకు చేరుకున్నారు. పడవలు, వలలు దెబ్బతినకుండా ఉండేందుకు వాటిని జాగ్రత్త చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement