ముందుగా మున్సిపోల్స్‌ | Officials All Set For Kadiri Municipal Elections | Sakshi
Sakshi News home page

ముందుగా మున్సిపోల్స్‌

Published Tue, Feb 4 2020 11:25 AM | Last Updated on Tue, Feb 4 2020 11:25 AM

Officials All Set For Kadiri Municipal Elections - Sakshi

స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మున్సి‘పోల్స్‌’ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ, మండల పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఈలోపు ‘పుర’పోరు పూర్తిచేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదలైంది.

అనంతపురం, కదిరి:  మున్సి‘పోల్స్‌’ ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు దాదాపుగా పూర్తి చేసిన అధికారులు.. తాజాగా సోమవారం అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఈసారి బ్యాలెట్‌ పద్ధతిలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మరోవైపు ఎన్నికల కమిషన్‌ ఏ క్షణాన నోటిఫికేషన్‌ విడుదల చేసినా.. తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ గంధం చంద్రుడుతో పాటు ఎస్పీ సత్యయేసుబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నెలాఖరులోపు ఎన్నికల నోటిఫికేషన్‌ రావచ్చని అధికారులు భావిస్తున్నారు.

వార్డుల వారీగాఓటరు జాబితా విడుదల
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే కులాలవారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. తాజాగా సోమవారం మొత్తం ఓటర్ల వివరాలతో వార్డుల వారీగా ఓటరు జాబితాను ప్రకటించారు. ఈ నెలాఖరులోగా ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. ఇటీవల కమిషనర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ నెలాఖరులోగా మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రావచ్చని పేర్కొన్నారు. అందుకే  నగర పాలక సంస్థతో పాటు మిగతా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లలో మునిగిపోయారు. కొత్తగా ఏర్పడ్డ పెనుకొండ మున్సిపాలిటీలో ఓటరు జాబితా కూడా ఇంకా ప్రకటించలేదు.

బ్యాలెట్‌ పద్ధతిన ఓటింగ్‌?
ఈసారి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌(ఈవీఎం)ల ద్వారా కాకుండా బ్యాలెట్‌ పద్ధతిన మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1,200 మంది ఓటర్లకు ఒక బ్యాలెట్‌ బాక్స్‌ చొప్పున అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

7న వీడియో కాన్ఫరెన్స్‌
పోలింగ్‌ కేంద్రాల వివరాలను ఈ నెల 5న ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే 6వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి, 7వ తేదీన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాల అందినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. 10న పోలింగ్‌ కేంద్రాల తుది జాబితా ప్రకటించనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.  

రిజర్వేషన్‌ల ఖరారు ఇలా..
నగరపాలక సంస్థలోని అన్ని డివిజన్‌లతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఉన్న వార్డుల  రిజర్వేషన్‌లను కలెక్టర్‌ నేతృత్వంలోనే నిర్ణయిస్తారు. నగరపాలక సంస్థ మేయర్‌ పదవితో పాటు అన్ని మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాల రిజర్వేషన్‌లు మాత్రం రాష్ట్ర స్థాయిలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్, కమిషనర్‌లు ఖరారు చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement