
సీఎం పర్యటకు సంబంధించి జెడ్పీ అతిథిగృహంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో గడచిన నాలుగైదు రోజులుగా అధికారులు, సిబ్బంది తెగ హడావుడి పడుతున్నారు. ఓవైపు ముఖ్యమంత్రి ఈ నెల 14వ తేదీన వస్తుండటం, మరోవైపు ఈ నెల 15న స్వాతంత్య్రదిన వేడుకలు నిర్వహించాల్సి రావడంతో రెండింటిపనులూ చేయాల్సి రావడంతో హైరానా పడాల్సి వస్తోంది. రెండింటిలో ఏ కార్యక్రమం విఫలమైనా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంద ని ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల సెలవురోజుల్లోనూ విధుల్లోనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 14వ తేదీన జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రోజు 10.30గంటల నుంచి సాయంత్రం 4గంటల వర కు సాలూరు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయనగరం చేరుకుని నగరదర్శిని, తర్వాత జెడ్పీ అతిథి గృహంలో అధికారులతో సమావేశమవుతారు. రాత్రికి ఇక్కడే బస చేసి ఉదయాన్ని శ్రీకాకుళం జిల్లా వెళతారు. ఇక ఆగస్టు 15వ తేదీన సోతంత్య్రదినోత్సవం ఉంది. ఆ రోజున పోలీసు పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించాల్సి ఉంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు జెండా ఆవిష్కరిస్తారు. శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చాల్సి ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలవద్ద సైతం పతాకావిష్కరణ చేయాల్సి ఉంటుంది.
రెండింటికి సన్నద్ధత కావాల్సిందే
రెండు కార్యక్రమాలు యంత్రాంగానికి కీలకమైనవే. స్వాతంత్య్ర వేడుకలకే పదిరోజుల ముందునుంచి సిద్ధమవడం పరిపాటి. మంత్రి ప్రసంగాని కి ప్రగతి నివేదికలు ఇవ్వడం, ఉత్తమ పనితీరు కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలకోసం కసరత్తు, ప్రగతిని చూపే శకటాల ఏర్పాటు, ఆస్తులు పంపిణీకి స్టాల్స్ ఏర్పాటు తదితర వాటిని ముందే చేసుకోవాలి. ఇది ఏటా జరిగేదే. ఈసారి ముఖ్యమంత్రి పర్యటన తోడవడంతో అధికారులు సతమతం అవుతున్నారు. నాలుగు రోజులుగా సాలూరులో సీఎం పర్యటన ఏర్పాట్లు చూస్తున్నారు. గదబ బొ డ్డవలసలో గ్రామదర్శిని విజయవంతం చేసేందు కు సన్నాహాలు చేస్తున్నారు, బహిరంగ సభకు జనాలను తరలించే పనిలో నిమగ్నమయ్యారు.సెలవు రోజునా తప్పని విధులు
ఈ కార్యక్రమాల పుణ్యమాని అధికారులతోపాటు సిబ్బంది కూడా రెండో శనివారం సెలవు తీసుకోలేకపోయారు. గ్రామదర్శిని జరిగే గ్రామంలో రోడ్లు బాగు చేయడం, కాలువలు శుభ్రపరచడం, రంగులు పూయడం, అంతా బాగుందని జనాలతో చెప్పించేందుకు సమావేశాలు పెట్టడం వంటివాటితో బీజీగా కొందరున్నారు. విజయనగరం పట్టణంలో రోడ్లు, కాలువలు బాగు చేయడం, లైట్లు వేయడం, గోడలకు రంగులు వేయడం, బస ఉండే జెడ్పీ అతిథిగృహంలో ఏర్పాట్లు చేయడంలో మరికొందరు ఉన్నారు. మొత్తమ్మీద ఈ రెండు కార్యక్రమాలు అధికారులు, సిబ్బందికి కత్తిమీద సాములా మారాయి.