చిత్తూరు (టౌన్): భూమిలేని దళిత వ్యవసాయ కూలీల కోసం ప్రత్యేకించి ప్రవేశపెట్టిన భూకొనుగోలు పథకం (ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్) జిల్లాలో చతికిలబడుతోంది. ఈపథకాన్ని 2013లో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. అయితే తొలి ఏడాది(2013 -14)లో కేటాయించిన లక్ష్యాలను సాధించడంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.
పథకం బాగున్నప్పటికీ అమలు తీరులో లోపాలు ఉన్నట్టు తెలుస్తోంది. భూమి మార్కెట్ రేటును పెంచిన ప్రభుత్వం భూ కొనుగోలు పథకం కింద పొలం కొనుగోలు చేసే యూనిట్ ధరను పెంచకపోవడంతో ఇస్తాననే రైతు లేడు, కొనుగోలు చేయడానికి ముందుకొచ్చే లబ్ధిదారుడు లేడు. దాం తో గత ఏడాది (2013-14) లక్ష్యసాధనలో ఎస్సీ కార్పొరేషన్ వంద శాతం వెనుకబడి ఉంది. పథకం కోసం కేటాయించిన కోట్లాది రూపాయల బడ్జెట్ మురుగుతోంది.
అమలు చేయాల్సిన తీరిదీ..
ఈ పథకం అమలు కోసం జిల్లా స్థాయి కమిటీలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కన్వీనర్‌గా, డీఆర్‌డీఏ పీడీ, డ్వామా పీడీ, వ్యవసాయశాఖ జేడీ, గ్రౌండ్‌వాటర్ డీడీ, ఎల్‌డీఎం, సంబంధిత ఆర్డీవోలు సభ్యులుగా వ్యవహరిస్తారు. మండల స్థాయి కమిటీల్లో ఎంపీడీవో చైర్మన్‌గా, తహశీల్దార్ కన్వీనర్‌గా, డీఆర్‌డీఏ ఏపీవో, వెలుగు వీవో, బ్యాం కు మేనేజర్లు సభ్యులుగా వ్యవహరించాల్సి ఉంది. వీరంతా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ పథకం అమలుపై లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకురావాల్సి ఉంది.
అయితే జిల్లా స్థాయిలో గానీ, మండలాల్లో గానీ ఎక్కడా సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వారు ముందుగా మండల కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులు జిల్లా కమిటీకి చేరుతాయి. మండల కమిటీ అనుమతి పొందిన వాటినే జిల్లా కమిటీ మంజూరు చేయాల్సి ఉంది. జిల్లా కమిటీ ద్వారా మంజూరైన యూనిట్లను ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసేందుకు బ్యాంకుకు సిఫారసు చేయాల్సి ఉంది. కానీ 2013-14 (గడచిన ఏడాది)లో వంద యూనిట్ల లక్ష్యం కాగా ఒకటి మాత్రమే దరఖాస్తు వచ్చింది. ఆ దరఖాస్తు కూడా సక్రమంగా లేకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్‌అధికారులు తిరస్కరించారు.
చాలీచాలని యూనిట్ ధర
రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరలను ప్రభుత్వం అమాంతం పెంచేసింది. అయితే సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు యూనిట్ ధరను పెంచకుండా భూములను కొనుగోలు చేయాలనుకోవడంతో ఇస్తానని ముందుకొచ్చే రైతు కనబడడం లేదు. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చినా ప్రభుత్వమిచ్చే డబ్బు చాలడం లేదు. దాంతో జిల్లాలో ఈ పథకం ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం మారుమూల గ్రామాల్లో సైతం ఎకరా రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ధర పలుకుతోంది. దాంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ కొనుగోలు పథకానికి కేటాయించిన యూనిట్ ధర చాలడం లేదు. పైగా రిజిస్ట్రేషన్ ఖర్చులకు కూడా దీన్నే వాడుకోవాల్సి ఉంది.
దాంతో లబ్ధిదారులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీనిపై ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రామారావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా యూనిట్ ధర చాలడం లేదన్నారు. ప్రస్తుతం జిల్లాలో భూముల ధరలు ఎక్కడ చూసినా ఎకరా రూ.10 లక్షలకు తక్కువ లేకుండా ఉందన్నారు. దానివల్ల లబ్ధిదారులకు భూమిని కొనివ్వడం సాధ్యం కావడం లేదన్నారు. అయితే ప్రభుత్వం మారినందున దీనిపై గైడ్‌లైన్స్ మారుతాయేమోనని చూస్తున్నట్టు తెలిపారు. గైడ్‌లైన్స్ మారకపోతే తామే ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు.
పథకం సరే.. లక్ష్యం ఏదీ?
Published Thu, Jun 26 2014 2:46 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement