మనవళ్లు, మనవరాళ్లతో ఆదెమ్మ, ఇరగమరెడ్డి (ఫైల్)
గంగాధరనెల్లూరు : వృద్ధ దంపతులు వారు ...బతికినంతకాలం ఒకొరికొకరు అన్యోన్యంగా ఉన్నారు. చివరకు కూడా విడదీయరాని అనుబంధంతోనే మరణించారు. వృద్ధాప్యంలో తోడునీడగా ఉంటారని ఆశించిన కుమారుడు, కోడలు ఏడాదిన్నర కాలంలోనే ఒకరి తరువాత ఇంకొకరు మరణించడం వారిని కలచివేసింది. ఇక బతకడమెందుకనే నిర్ణయానికి వచ్చి బలవన్మరణానికి ఒడిగట్టారు. పురుగుల మందుతాగి తనువు చాలించారు. సోమవారం జరిగిన ఈ విషాదకర సంఘటనతో గంగాధరనెల్లూరు మండలంలోని బట్టుజంగనపల్లె కన్నీరుమున్నీరవుతోంది. ఆ గ్రామానికి చెందిన ఇరగమరెడ్డి అలియాస్ పెద్దబ్బరెడ్డి (92) ఆదెమ్మ 83) భార్యాభర్తలు. వీరికి అదే గ్రామంలో రెండెరాల పొలం మాత్రమే ఉంది. అయినా ఎంతో తెలివిగా ఎకరా పొలంలో జామతోట సాగుచేశారు. ఆ ఫలసాయంతోనే కుటుంబపోషణ జరుగుతుండేది. వీరి సంతానం ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు జరిగాయి.
పెద్ద కుమారుడు జయరామరెడ్డి(61), కోడలు సరోజమ్మ (58) గ్రామంలోనే ఉంటూ తల్లిదండ్రుల బాగోగులు చూసుకునేవారు. అనారోగ్య కారణంతో ఆరు నెలల క్రితం జయరామరెడ్డి,, సంవత్సరం క్రితం సరోజమ్మ మృతిచెందారు. రెండో కుమారుడు భాస్కర్‌రెడ్డి (51) బెంగళూరులోని ఓ ప్రెవేటు ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఫ్యాక్టరీ మూసివేయడంతో ప్రస్తుతం చిన్నపాటి ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో మనవడు (జయరామరెడ్డి కుమారుడు)మహేష్‌రెడ్డి గ్రామంలో ఉంటూ అవ్వ, తాత బాగోగులు చూసుకునేవాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో జీవితం మీద విరక్తి చెందిన ఇరగమరెడ్డి, ఆదెమ్మ పురుగుల మందు తాగారు. వాంతులు చేసుకుంటుండగా చుట్టుపక్కలవారు గమనించి చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ సోమవారం రాత్రి ఇద్దరూ మృతి చెందారు. కుమారుడు, కోడలు మృతి చెందినప్పట్నుంచి దిగాలుగా ఉంటున్న వారిద్దరూ మృతిచెందడంతో జట్టుజంగనపల్లె శోకసంద్రమైంది. మంగళవారం ఆ వృద్ధజంజకు బంధువులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment