మనసున్న వైద్యులు | Old Students Devoloped GGH Guntur | Sakshi
Sakshi News home page

మనసున్న వైద్యులు

Published Mon, Sep 10 2018 12:43 PM | Last Updated on Mon, Sep 10 2018 12:43 PM

Old Students Devoloped GGH Guntur - Sakshi

గుంటూరు వైద్య కళాశాల

గుంటూరు మెడికల్‌ : గుంటూరు వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థులు చేస్తున్న సేవలు దేశంలోని వైద్యులందరికీ ఆదర్శం. ప్రతి ఒక్కరూ జింఖానా వైద్యులను ఆదర్శంగా తీసుకొని తమ మాతృసంస్థలకు సేవ చేయాలి. ఇది సాక్షాతూ  కలెక్టర్, గుంటూరు జీజీహెచ్‌ చైర్మన్‌ కోన శశిధర్‌ ఈనెల 7న జింఖానా వైద్యులను ఉద్ధేశించి మాట్లాడిన మాటలివి.

ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వైద్య విద్యార్థులంతా ఒక సంఘంగా ఏర్పడి చదువుకున్న మాతృ సంస్థ రుణం తీర్చుకుంటూ సంస్థ అభివృద్ధికి నిరంతరం అవిరళ కృషి చేస్తున్నారు. ఆసంఘం పేరే జింకానా. గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్లంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడి తాము చదువుకున్న కళాశాలను మరిచిపోకుండా  అభివృద్ధికి కృషి చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. గుంటూరు వైద్య కళాశాల అల్యూమిని ఆఫ్‌ నార్త్‌ అమెరికా (జింకానా) 1981లో ఏర్పడింది. సుమారు 2,500 మంది పూర్వ వైద్యులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరంతా ప్రతి ఏడాది తాము వైద్య వృత్తిలో సంపాదించుకున్న ధనంలో కొద్దో గొప్పో గుంటూరు వైద్య కళాశాలకు, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అభివృద్ధికి విరాళంగా అందజేస్తూ పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు.

జింకానా ఆడిటోరియంతో వెలుగులోకి...
జింకానా ఆధ్వర్యంలో కళాశాల, ఆసుపత్రికి ప్రతి ఏడాది నిధులు అందుతున్నా 2004లో కళాశాలలో జింకానా ఆడిటోరియం నిర్మాణంతో పూర్వ విద్యార్థుల సేవలు వెలుగులోకి వచ్చాయి. సుమారు రూ. 2.50 కోట్లతో ఉమ్మడి రాష్ట్రాల్లో ఏవైద్య కళాశాలలో లేని విధంగా 850 సీటింగ్‌ సామర్ధ్యంతో విదేశాల్లో ఉండే మాదిరిగా జింకానా ఆడిటోరియం నిర్మించారు. ఈ ఆడిటోరియం పలువురు ఉన్నతాధికారుల మన్ననలు సైతం పొందింది. 2009లో డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ సూపర్‌స్పెషాలిటీ, ట్రామా సెంటర్‌ నిర్మాణంలో జింకానా సభ్యుల పాత్ర ఎంతో కీలకం. రూ. 35 కోట్లతో భవన నిర్మాణం జరుగ్గా అందులో రూ. 20 కోట్లు జింఖానా సభ్యులు విరాళంగా అందజేశారు. డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ ఒక్కరే రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడంతో పొదిల ప్రసాద్‌ భవన నిర్మాణం జరిగింది. ప్రపంచ స్థాయి మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్స్‌ జింఖానా బిల్డింగ్‌లో నిర్మించడంతో నేడు గుండె, కిడ్ని మార్పిడి, మోకీళ్ల మార్పిడి ఆపరేషన్‌లు జీజీహెచ్‌లో జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణంతో జీజీహెచ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

వైద్య విద్య బలోపేతం కోసం...
గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందించడంలో జింకానా తన వంతు పాత్ర పోషిస్తోంది. కళాశాలలో లెక్చరర్‌ గ్యాలరీలు ఆధునీకరించి ఆడియో, వీడియో సిస్టమ్‌లు ఏర్పాటు చేసి ఎంసీఐ గుర్తింపు కోసం ఇబ్బంది లేకుండా చేశారు. దాంతోపాటు ఈ–లైబ్రరీ నిర్మించి వైద్య విద్యలో వస్తున్న ఆధునిక వైద్య పద్ధతులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా మెరుగు పరిచారు.

తాజాగా ఎంసీహెచ్‌ నిర్మాణం
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మాతా శిశు మరణాలు తగ్గింపే లక్ష్యంగా  జీజీహెచ్‌లో మాతా, శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌వార్డు) నిర్మించాలని నిర్ణయించాయి. ఆసుపత్రిలో  రూ. 35 కోట్లతో ప్రభుత్వం నిర్మించే ఎంసీహెచ్‌ బ్లాక్‌తో పూర్తి సేవలు లభించక పోవడంతో జింఖానా వైద్యులు ముందుకొచ్చారు. జింఖానా సభ్యులు రూ. 30కోట్లు విరాళం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఐదుకోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్‌ పొదిల ప్రసాద్‌ ఎంసీహెచ్‌ వార్డు నిర్మాణం కోసం మరో రెండు కోట్లు విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చారు.  మొత్తం రూ. 65 కోట్లతో ఎంసీహెచ్‌ బ్లాక్‌ నిర్మాణం త్వరలో జరుగనుంది. సుమారు 600 పడకలతో ఐదంతస్తులు  భవనాన్ని నిర్మించనున్నారు. అప్పుడే పుట్టిన పసికందుకు, గర్భిణులకు,బాలింతలకు కార్పొరేట్‌ వైద్యసేవలు ఎంసీహెచ్‌ వార్డులో ఉచితంగా అందనున్నాయి.

40 ఏళ్ల తరువాత వైద్యుల అపూర్వ కలయిక
గుంటూరు మెడికల్‌: గుంటూరు వైద్య కళాశాలలో 1978లో ఎంబీబీఎస్‌ వైద్య విద్యను అభ్యసించిన వైద్యులు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం కళాశాల జింఖానా ఆడిటోరియంలో కలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి వృత్తి మెలకువలు నేర్పిన కళాశాల అభివృద్ధి కోసం తమ వంతు సాయం చేయాలని ముందుకొచ్చారు. వైద్య కళాశాలలోని ఓ లెక్చర్‌ గ్యాలరీని ఆధునీకరణ చేసేందుకు ఎనిమిది లక్షలు విరాళం ఇచ్చేందుకు అంగీకారం తెలిపి కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుబ్బారావుకు విషయాన్ని తెలిపారు. ఈనెల 23న తమ బ్యాచ్‌ వైద్యులంతా హాజరై నిధులు ఇస్తామని వెల్లడించారు. గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్, జీజీహెచ్‌ రేడియాలజిస్ట్‌ డాక్టర్‌ వూటుకూరి సురేష్, న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ పమిడిముక్కల విజయ, కంటి వైద్యనిపుణుల డాక్టర్‌ పసుమర్తి రాజశేఖర్‌ తదితరులు కళాశాలలో కలుసుకుని నాటి జ్ఙాపకాలు నెమరువేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement