నగల కోసం ఓ వృద్ధురాలిని హత్యచేసిన సంఘటన పామర్రులో మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
నగల కోసం వృద్ధురాలి హత్య
Oct 30 2013 4:14 AM | Updated on Sep 2 2017 12:06 AM
పామర్రు రూరల్, న్యూస్‌లైన్ : నగల కోసం ఓ వృద్ధురాలిని హత్యచేసిన సంఘటన పామర్రులో మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. గ్రామంలోని జమ్మిచెట్టు సెంటర్ వద్ద ఆరుమళ్ల పిచ్చమ్మ(80) తన సొంత ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమె కుమారుడు విజయవాడలో, కుమార్తె నెల్లూరులో ఉంటున్నారు. దీంతో ఇంట్లోని కొన్ని గదులను అద్దెకు ఇచ్చి, మిగతావాటిలో తాను ఉంటోంది. రోజూ మా దిరిగానే సోమవారం రాత్రి నిద్రించే ముందు లోపల తాళం వేసుకుంది. దుండగులు వెనుక ద్వారం నుంచి లోనికి చొరబడి పిచ్చమ్మను గొంతు పిసికి హత్యచేశారు. ఆమె వద్ద ఉన్న ఐదున్నర కాసుల చెవిదిద్దులు, గొలుసును దొంగిలించుకుపోయారు. మంగళవారం ఉదయం వంట మనిషి వచ్చి, ఇంట్లో పడిపోయి ఉన్న పిచ్చమ్మను కిటికీలో నుంచి చూసి స్థానికులకు తెలిపింది.
వారు మృతురాలి కుమారుడు, కుమార్తెకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ ఘటనపై అందిన స మాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. వేసిన తలుపులు వేసినట్లే ఉండటంతో దొంగలు లోనికి ఎలా చొరబడ్డారనేది పోలీసులు, స్థానికులకు అంతుచిక్కకుండా ఉంది. బీరువాలోని డాక్యుమెంట్లు, కొన్ని పత్రాలు పక్కనే ఉన్న మంచంపై చిందరవందరగా పడి ఉన్నాయి. పిచ్చమ్మ చేతికి ఉన్న గాజులను దొంగలు వదిలేయడంతో అవి నకిలీవని వారికి తెలుసా? అనే అనుమానం కలుగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. బాగా తెలిసిన వ్యక్తే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అపహరణకు గురైన సొత్తు విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని అంచనా.
క్లూస్ టీమ్ పరిశీలన
మచిలీపట్నం నుంచి వచ్చిన క్లూస్‌టీం ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించింది. డాగ్ స్క్వాడ్‌ను కూడా పోలీసులు రప్పించారు. జాగిలం ఇంటిలో నుంచి వెనుక వైపునకు వెళ్లింది. కొంతదూరం వెళ్లి మరలా ఇంటికే తిరిగివచ్చింది. ఇంట్లోనే రెండుసార్లు తిరిగి అక్కడే ఆగిపోయింది. దీంతో నేరస్తుడు ఈ ప్రాంతవాసేనని, జాగిలం తిరిగిన తీరును బట్టి వెనుక తలుపు నుంచి లోనికి చొరబడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు మంగళవారం రాత్రి ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామర్రు సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్సై డి.శివశంకర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
పామర్రు ఎమ్మెల్యే డీవై దాస్ ఘటనాస్థలికి వచ్చి, పిచ్చ మ్మ మృతదేహాన్ని సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వచ్చిన వారిలో వీఆర్వో రాము, వార్డు మెంబర్ టి.సాంబశివరావు తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement