కోటప్పకొండలో పురాతన మెట్ల మార్గం | oldest staircase Situated in the Kotappa konda | Sakshi
Sakshi News home page

కోటప్పకొండలో పురాతన మెట్ల మార్గం

Published Wed, Jan 27 2016 7:00 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

oldest staircase Situated in the Kotappa  konda

గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయానికి చేరుకునే పురాతన మెట్ల మార్గం బయటపడింది. కొండ కింద నుంచి తాగునీటి పైప్ లైన్ ఏర్పాటుకు పనులు చేపట్టిన సందర్భంలో శిథిలావస్థలో ఉన్న మెట్లు బయటపడ్డాయి. తాగునీటి ఎద్దడి నివారణకు కొండ కింద సంపు నిర్మించి కొండపైకి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొండపైకి పైప్‌లైన్ ఏర్పాటు చేసేందుకు ముళ్ళ పోదలను తొలగిస్తుండగా ఇవి కనిపించాయి. కమ్మజన సంఘం సత్రం వెనుక వైపు నుంచి నేరుగా కొండమీదకు వెళ్ళే విధంగా కొండ రాళ్ళను మెట్లుగా అమర్చారు.


వంద ఏళ్ల కింద వాడారు..
సోపాన మార్గంలో మెట్లను అభివృద్ధి చేసిన తరువాత ఈ దారి ఎవరూ వినియోగించక పోవడంతో.. ఈ ప్రాంత మంతా ముళ్ళ పోదలతో నిండిపోయింది. భక్తులు కోటప్పకొండకు చేరుకునేందుకు రెండు మెట్ల మార్గాలు ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు బయటపడిన మార్గంతో పాటు డిఆర్‌డిఎ శిక్షణా కేంద్రం వెనుక వైపు నుండి మరో మార్గం ఉండేది. ఈ దారిని ఏనుగుల దారి అంటారు. కొండమీదకు అవసరమైన సామాగ్రిని ఏనుగుల ద్వారా కొండమీదకు తరలించే వారని చెబుతారు. అయితే తరువాత కాలంలో త్రికోటేశ్వరస్వామి వారి దేవస్థానం ట్రస్టీలుగా ఉన్న నరసరావుపేట జమీందార్లు నూతనంగా సోపాన మార్గం నిర్మించారు.

దీంతో ఈ మార్గం గుండానే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కాలక్రమంలో గతంలో ఉన్న రెండు మెట్ల మార్గాలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు బయటపడి న మెట్ల మార్గం పూర్తిగా కొండపైకి లేదు. కొండపైన అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన విస్తరణ పనుల్లో ఈ మార్గం మూతబడిపోయింది. కొండపైన ఇప్పుడు ఉన్న క్యాంటిన్ వెనక కొండరాళ్ళతో నింపి విస్తరించడంతో మెట్ల మార్గం దాని కిందకు వెళ్ళిపోయింది. బయటపడిన మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం లేదని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement