మళ్లీ చేబదులు
చరిత్ర పునరావృతం చేస్తున్న చంద్రబాబు సర్కారు
ఆర్బీఐ నుంచి తాజాగా రూ. 950 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: చరిత్ర పునరావృతమైంది. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క ఏడాదిలోనే ఏకంగా 220 రోజుల పాటు చేబదుళ్లకు వెళ్లిన చరిత్ర ఉంది. అంతేకాకుండా ఇప్పటిలాగే ఉద్యోగుల జీతాలకు డబ్బుల్లేవ ని చెపుతూ ప్రజలపై పన్నులు, చార్జీల భారం మోపిన ‘ఘనత’ కూడా ఆయనదే. పదేళ్ల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అదే చరిత్రను పునరావృతం చేస్తోంది. గత నెలలో రూ.470 కోట్ల మేరకు ఆర్‌బీఐ దగ్గర చేబదులు తీసుకున్న ప్రభుత్వం.. ఈ నెల 2వ తేదీన మరో రూ.950 కోట్ల చేబదులు తీసుకుంది.
ఈ విధంగా జనవరి, ఫిబ్రవరి రెండు నెలల్లో ఇప్పటికే రెండుసార్లు చేబదులుకు వెళ్లినట్లైంది. అయితే దీనిపై సచివాలయ ఉద్యోగ వర్గాలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. అప్పు చేసి జీతాలు ఇస్తున్నామని చెప్పడానికే ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ (చేబదులు)కు వెళుతోందని అంటున్నారు. 10వ పీఆర్సీ సిఫారసులను అమలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వం పథకం ప్రకారమే చేబదుళ్లకు వెళుతోందని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.
డబ్బుల్లేక ప్రభుత్వం అప్పులు చేసి మరీ జీతాలు ఇస్తోందని, ఇలాంటి సమయంలో ఉద్యోగులు ఫిట్‌మెంట్ శాతం ఎక్కువగా కోరడం ఎంతవరకు సమంజసం అని వాదించడానికే ఇలా చేస్తోందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడానికి సిద్ధంగా ఉన్న విషయం గుర్తుచేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవని, అందుకే చేబదుళ్లకు వెళుతున్నట్టుగా ప్రచారం చేస్తూ.. విద్యుత్ చార్జీల విషయంలో ప్రజలను మానసికంగా సమాయత్తం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వాదన వినిపిస్తోంది.
చేబదులుకు వెళ్లాల్సిన అవసరమే లేదు..
వారం రోజుల క్రితం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ ఇక వరుసగా చేబదుళ్లకు, అప్పులకు వెళ్తామని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేబదుళ్లకు వెళుతున్నట్టుగా అర్థం అవుతోంది. ఎందుకంటే ఉద్యోగుల జీతాలకు, పింఛన్ల చెల్లింపునకు నెలకు రూ.2,200 కోట్లు అవసరం.
అయితే గత నెల 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల విక్రయం ద్వారా రూ.1,000 కోట్ల రుణం తీసుకుంది. సెక్యూరిటీల విక్రయం ద్వారా మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకోవడానికి కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. అందువల్ల చేబదులుకు వెళ్లాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే చేబదుళ్లకు వెళ్తోందని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పన్నుల ద్వారా జనవరిలో వచ్చిన ఆదాయ వివరాలు
రంగం లక్ష్యం వచ్చింది(రూ.కోట్లలో)
వ్యాట్ 2,554 2,156
ఎక్సైజ్ 364 175
వాహనాలు 125 129
స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ 222 278
ఇతర పన్నులు 116 56