నిర్లక్ష్యానికి పరాకాష్ట | one and half crore withdraw funds in OMC | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి పరాకాష్ట

Published Tue, Apr 18 2017 12:36 PM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

నిర్లక్ష్యానికి పరాకాష్ట

నిర్లక్ష్యానికి పరాకాష్ట

► ఓఎంసీలో రూ.కోటిన్నర నిధులు వెనక్కి..
► నగరపాలక సంస్థ అధికారుల బాధ్యతారాహిత్యం
► ఫైల్‌ సరిగా లేదంటున్న ట్రెజరీ అధికారులు
► ట్రెజరీలోనే తప్పిదం జరిగిందంటున్న ఓఎంసీ అధికారులు
► కాంట్రాక్టర్లు చెప్పే వరకు తెలుసుకోలేని దుస్థితి

ఒంగోలు నగరపాలక సంస్థకు అప్పులు లేవు... నిధుల కొరత లేదు. కార్పొరేషన్‌ సాధారణ నిధులతోపాటు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు.. ఫైనాన్స్‌ గ్రాంట్‌లతో నిండు కుండలా ఉంది. ఎన్నికలు జరగాల్సిన కార్పొరేషన్‌ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అభివృద్ధి గ్రాంటు కూడా కేటాయించింది. నిధులు ఎక్కువగా ఉండటం, కౌన్సిల్‌ లేకపోవడం, ప్రత్యేక అధికారి అయిన కలెక్టర్‌ పట్టించుకోకపోవడంతో నగరపాలక సంస్థలో అధికారుల్లో బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం పెరిగిపోయింది.

ముఖ్యంగా అకౌంట్స్‌ సెక్షన్‌లో అకౌంటెంట్‌తో పాటు ఇతర సిబ్బంది బిల్లులు చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యం చేయడం పరిపాటిగా మారింది. ఫలితంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల్లో సుమారు రూ.1.50 నిధులు వెనక్కి వెళ్లాయి. ఆ విషయం కాంట్రాక్లర్లు చెప్పే వరకు నగరపాలక అధికారులకు తెలియకపోవడం వారి నిద్రమత్తుకు నిదర్శనం.

జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు నిధులు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు.   రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు కూడా చెల్లించే పరిస్థితుల్లో లేవు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉన్న ఓఎంసీలో అధికారులు మాత్రం పుష్కలంగా ఉన్న నిధులను వినియోగించుకునే పరిస్థితుల్లో లేరు. ఫలితంగా  కోటిన్నర నిధులు వెనక్కి వెళ్లాయి. 13వ ఆర్థిక సంఘం నిధులు నగరపాలక కార్యాలయానికి రూ.6కోట్ల పైగానే వచ్చాయి. ఆ నిధులకి సంబంధించి 41 పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు.

వాటిలో సుమారు 50శాతం పనులు పూర్తికాగా వాటికి సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. మిగిలిన 50శాతం పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయి. ఈ పనుల విలువ  రూ.3కోట్లు ఉంది. వాటికి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. మార్చి 31లోపు బిల్లులు చెల్లించాలి. బిల్లులకు సంబంధించిన ఫైళ్లు నగరపాలక సంస్థ అకౌంట్స్‌ సెక్షన్‌ అధికారులు మార్చి 20 తర్వాత సబ్‌ట్రెజరీ కార్యాలయానికి పంపారు.

అంతటితో తమ పని అయిందకొని మిన్నకున్నారు. ఫైల్‌ పంపిన తర్వాత వాటి గురించి తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. మార్చి నెలాఖరు కావడంతో కాంట్రాక్టర్లు బిల్లులు తమ అకౌంట్లకు జమకాకపోవడంతో సబ్‌ట్రెజరీలో ఆరా తీశారు. బిల్లులకు సంబంధించిన ఫైళ్లలో లోపాలున్నాయని సక్రమంగా లేవని ట్రెజరీ అధికారులు సమాధానం చెప్పడంతో అవాక్కయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ అకౌంట్స్‌ అధికారులు నానా హడావుడి చేసి ఫైళ్లలో చిన్న చిన్న సవరణలు చేసి మార్చి 31వ తేదీ తిరిగి   ట్రెజరీకి అందచేశారు.

నెల చివరి రోజు కావడంతో ట్రెజరీలో అన్ని శాఖలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు జరుగుతుండటంతో సర్వర్‌ మోరాయించింది. దీంతో ట్రెజరీకి అందించిన రూ.3 కోట్ల బిల్లులో సగం మాత్రమే పాస్‌ అయ్యి మిగిలిన మొత్తం వెనక్కి పోయింది. దీంతో నగరపాలక అధికారులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు.

తలలు పట్టుకుంటున్న అధికారులు..
నిధులు వెనక్కి పోవడంతో స్థానిక ఎమ్మెల్యే ట్రెజరీ, ఓఎంసీ అధికారులపై మండిపడినట్లు సమాచారం. ఇప్పుడు ఆ నిధుళకు చెల్లింపులు ఎక్కడి నుంచి సర్ధుబాటు చేయాలో అర్ధంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అకౌంట్స్‌ సెక్షన్‌ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఉన్నతాధికారులు నిర్థరణకు వచ్చినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఓఎంసీ అధికారులు ట్రెజరీలో పొరపాటు జరిగిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకనైనా నగరపాలక కమిషనర్‌ నిద్రమత్తు వదిలి ఉద్యోగుల పట్ల కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కౌన్సిల్‌ లేకపోవడంతో ప్రత్యేక అధికారి అయినా ఓఎంసీపై ప్రత్యేక దృష్టి సారించి పాలనను గాడిన పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement