స్థానిక బెలగాం చివారున, గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదాలు సంభవించాయి.
పార్వతీపురం: స్థానిక బెలగాం చివారున, గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి...
స్థానిక బెలగాం చివారున గల జేపీ అపార్ట్‌మెంట్స్ వద్ద సైకిల్, మోటారు సైకిల్ ఢీకొట్టాయి.
జేపీ అపార్ట్‌మెంట్స్ నుంచి సైకిల్ పై వస్తున్న నిఖిల్‌ను, మోటారు సైకిల్‌పై వస్తున్న గండి సింహాచలం బలంగా ఢీ కొట్టాడు. ఈ సంఘటనలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమచికిత్స అందించి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
అలాగే గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలోని జంక్షన్ వద్ద కురుపాంకు చెందిన ఆటోడ్రైవర్ రాయిపల్లి సుమన్(39) మంగళవారం రాత్రి పార్వతీపురం నుంచి ఇంటికి వస్తూ తోటపల్లి జంక్షన్ వద్ద ఆటోను పక్కనబెట్టి బహిర్భూమికి వెళుతుండగా ఉల్లిభద్రకు చెందిన శెట్టి ధనుంజయనాయుడు మోటారు సైకిల్‌తో ఢీ కొట్టాడు. దీంతో సుమన్ అక్కడికక్కడే మృతి చెందగా, ధనుంజయనాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సుమన్‌కు భార్య శ్యామల, కూతురు ఆరేళ్ల శాలిని, ఐదేళ్ల కొడుకు చరణ్ ఉన్నారు.