రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
Published Wed, Feb 26 2014 3:35 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
పాతపట్నం రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని కాగువాడ వద్ద గల సీతారామ కల్యాణ మండపం వద్ద సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మంగి నాగరాజు (30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బూరగాం గ్రామానికి చెందిన నాగరాజు తాపీమేస్త్రిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, చిన్న, కుమార్తెలు జ్యోతి, భాగ్యం, తల్లి రమణమ్మ ఉన్నారు.
మోటార్ సైకిల్ అదుపుతప్పడంతో కార్మికుడికి గాయాలు
పాతపట్నం : రోడ్డు ప్రమాదంలో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అచ్చుతాపురం వద్ద మంగళవారం జరిగిన ప్రమాద వివరాలిలా ఉన్నాయి. అందాల ప్రసాద్ అనే కార్మికుడు పర్లాకిమిడి నుంచి పాతపట్నం వైపు ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. అచ్చుతాపురం వద్ద వాహనం అదుపు తప్పడంతో ఆయన గాయాల పాలయ్యాడు. బాధితుడిని స్థానికులు పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్ సదాశివ ప్రాథమిక చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.సురేష్‌బాబు తెలిపారు.
ఆటో, మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో ముగ్గురికి...
టెక్కలి : టెక్కలి పాత జాతీయ రహదారిపై పోలీస్‌స్టేషన్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. శ్యామసుందరాపురం గ్రామానికి చెందిన డొక్కరి బాలకృష్ణ గ్రామంలో నుంచి మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా, కోటబొమ్మాళి నుంచి టెక్కలి వస్తున్న ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో బాలకృష్ణతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న పాకివలస గ్రామానికి చెందిన యర్ర గణపతి, బొప్పాయిపురం గ్రామానికి చెందిన చిగురువలస అప్పన్న తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్‌సలో టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. దీనిపై కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
ద్విచక్రవాహనం ఢీకొని ఒకరికి...
లావేరు : మండలంలోని బొంతుపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనం ఢీకొని ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని గుమడాం గ్రామానికి చెందిన యండపల్లి చిన్నారావు సైకిల్‌పై బొంతుపేట గ్రామానికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం తిరిగి స్వగ్రామం వెళుతూ బొంతుపేట గ్రామం వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారావును శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. ఎస్సై అప్పారావు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాద వివరాలను సేకరించారు.
రెండు బైక్‌లు ఢీకొనడంతో ఒకరికి....
ఇచ్ఛాపురం : పట్టణ శివారులోని గ్యాస్ ఏజెన్సీ వద్ద రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఒడిశాలోని సుమండి గ్రామానికి చెందిన శివశంకర్ బెహరా, అతని స్నేహితుడు ఇచ్ఛాపురం నుంచి తమ గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో వికలాంగుడైన శివశంకర్‌కు వైకల్యం ఉన్న కుడి కాలికి రెండు చోట్ల ఫ్రాక్చరైంది. బాధితుడిని 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ హెచ్‌సీ జనార్దనరావు తెలిపారు.
ఆటో బోల్తాపడి ముగ్గురికి...
కవిటి : ఆటో బోల్తాపడిన ఘటనలో ముగ్గురు గాయాల పాలయ్యారు. బట్టివానిపాలెం నుంచి పలువురు మత్స్యకార మహిళలు శిలగాం జంక్షన్‌లోని మంగళవారం సంతకు వెళుతున్నారు. జగతి ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కె.కామమ్మ, డ్రైవర్ యుగంధర్, కె.ఎర్రమ్మ గాయపడ్డారు. బాధితులను 108లో ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ యుగంధర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. కామమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై వై.మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement