రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శుక్రవారం కర్నూలు నగరం మారుమోగనుంది. ఒకేసారి లక్ష మంది రోడ్లపైకి వచ్చి సమైక్యనినాదాలతో హోరెత్తించనున్నారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శుక్రవారం కర్నూలు నగరం మారుమోగనుంది. ఒకేసారి లక్ష మంది రోడ్లపైకి వచ్చి సమైక్యనినాదాలతో హోరెత్తించనున్నారు. ‘లక్ష గళ ఘోష’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా విద్యాసంస్థల కార్యాచరణ సమితి భారీ ఏర్పాట్లు చేపట్టింది. నగరంలోని అన్ని విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు ఇందులో పాల్పంచుకోవాలని జేఏసీ ఆహ్వనించింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు కోట్ల సర్కిల్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమై.. 10 గంటలకు నగరంలోని అన్ని వైపుల నుంచి ర్యాలీలు ఈ ప్రాంతానికి చేరుకునేటట్లు ప్రణాళిక రూపొందించారు.
రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాలు, సమైక్యంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలపై వక్తలు ప్రసంగించనున్నారు. లక్ష గళ ఘోష కార్యక్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సైతం పాల్పంచుకోవాలని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కన్వీనర్ హెచ్.తిమ్మన్న గురువారం ఒక ప్రకటనలో కోరారు.