బడికెళ్లొస్తానని..వెళ్లిపోయావా..
- లేతమనసుల్లో గూడుకట్టుకున్న కక్షలు
- విద్యార్థుల ఘర్షణలో ఒకరి మృతి
- కన్నీటిపర్యంతమైన తల్లిదండ్రులు
తిరుపతి క్రైం: స్నేహపూర్వక వాతావరణంలో విద్యను అభ్యసించాల్సిన లేత మనుసుల్లో తెలియని అనుమానాలు, గూడు కట్టుకున్న కక్షలకు ఓ విద్యార్థి బలయ్యా డు. భయభ్రాంతులకు గురైన తరగతిలోని ఇతర విద్యార్థులు అరుపులు, కేకలు పెడుతూ బీతావహులై పరుగులు తీశారు. మృతిచెందిన బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో విద్యా నిలయంలో విషాదం అలుముకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాధితుడి తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుచానూరు సమీపంలోని యోగిమల్లవరంలో కాపురం ఉంటున్న పరంధామరెడ్డి, లక్ష్మీ దంపతులకు రెండో కుమారుడు జీ.మోహన్‌కృష్ణారెడ్డి(15). ఇతను శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం తరగతి గదిలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మోహన్‌కు తోటి విద్యార్థులతో చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఇది చినికి చినికి పెద్దది కావడంతో నలుగురు విద్యార్థులు ఒక్కటై మోహన్‌కృష్ణపై దాడిచేశారు.
మూకుమ్మడిగా మోహన్ కృష్ణారెడ్డిని గ్లాస్‌డోర్ పైకి బలంగా తోయడంతో గ్లాసు పగిలిపోయింది. మోహన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్పటికే ఆవేశంతో ఊ గిపోయిన ఓ విద్యార్థి కింద పడిఉన్న అద్దం ముక్కను చేతిలోకి తీసుకుని మోహన్ మెడ, కుడి వైపు కాలర్ బోన్ పక్కన బలం గా పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మోహన్ స్పృహ తప్పి పడిపోయాడు. అప్పటి వరకు సంఘటనను చూస్తున్న తోటి విద్యార్థులు భయంతో వణికిపోతూ, బిగ్గరగా అరుపులు, కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.
విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు మోహన్‌కృష్ణను హడావిడిగా ఓ ఆటోలో నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మోహన్‌కృష్ణ మరణించాడని ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ వద్దకు, పాఠశాల వద్దకు పరుగులు తీశారు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్పీ త్రిమూర్తులు, డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, సీఐ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కన్నీటి పర్యంతమైన కుటుంబసభ్యులు
ముద్దుల కొడుకు రక్తపు మడుగులో పడి ఉన్నారని సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి తల్లి లక్ష్మీ కన్నీటి పర్యంతమయ్యారు. ఉదయం పాఠశాలకు బయలుదేరుతూ వెళ్లొస్తానమ్మా...అని చెప్పి ఇలా శాశ్వతంగా వదిలిపోయావా తండ్రీ అంటూ గుండెలు బాదుకుంటూ రోదించింది.
ఉపాధ్యాయుల నిర్లక్ష్యం?
రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థి మోహనకృష్ణను వెంటనే ఆస్పతి తీసుకెళ్లకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పట్టించుకోకుండా కాలయాపన చేశారన్నారు.
ఓ విద్యార్థినితో స్నేహంగా ఉండడం వల్లేనా?
మోహనకృష్ణ ఓ విద్యార్థినితో చనువుగా, స్నేహపూర్వకంగా మెలిగేవాడని, దీన్ని జీర్ణించుకోలేని తోటి విద్యార్థులు పలుమార్లు మోహన్‌ను హెచ్చరించినట్టు తెలిసింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో మోహన్‌తో ఘర్షణ పడి హెచ్చరించినట్టు తెలిసింది. అది హత్యకు దారితీస్తుందని ఊహించలేక పోయామని విద్యార్థులు చర్చించుకుంటున్నారు.
భోజన సమయంలో గొడవే
భోజన విరామ సమయంలో తోపులాటలో విద్యార్థి మృతిచెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. మాటా మాటా వచ్చి ఒకరి నొకరు నెట్టుకోవడంతో డోర్‌కు ఉన్న గాజుపై పడడంతో ఆ ముక్కలు తగిలి మరణించినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా కేసు నమోదు చేసిన పోలీసులు, అనుమానంపై ఒక విద్యార్థిని విచారించారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఈస్ట్ సీఐ తెలిపారు.