ప్రాణం తీసిన అతివేగం.. | one young man died in bike accident | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అతివేగం..

Published Fri, May 1 2015 12:50 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ప్రాణం తీసిన అతివేగం.. - Sakshi

ప్రాణం తీసిన అతివేగం..

 పెయింట్ డబ్బాలు ఢీకొట్టి అదుపుతప్పిన బైక్
 మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
 మరొకరికి స్వల్పగాయాలు
 సినిమా సన్నివేశంలా జరిగిన ఘటన

 
తాడేపల్లి రూరల్ : అతివేగం మరో రెండు నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఓ యువకుడిని బలితీసుకుంది. పెయింట్ డబ్బాల రూపంలో మృత్యువు వెంటాడగా, పెట్రోల్ రూపంలో సజీవ దహనం చేసింది. తాడేపల్లి పట్టణ పరిధిలోని కనకదుర్గ వారధిపై గురువారం అందరూ చూస్తుండగా అచ్చం సినిమా సన్నివేశంలా జరిగిపోయింది. ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చన్న మాటకు ఈఘటన నిదర్శనంగా నిలిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గుంటూరుకు చెందిన వెలగల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు సీతారామరాజు (23)కు చిలకలూరిపేట సమీపంలోని మెట్టపల్లి గ్రామానికి చెందిన మిత్రుడు మందా నారాయణస్వామితో కలిసి రిలయన్స్ 4జి కంపెనీలో విధులు నిర్వహిస్తుంటారు. వీరిద్దరూ నిత్యం గుంటూరు నుంచి పల్సర్ ద్విచక్రవాహనంపై విజయవాడ బెంజ్ సర్కిల్ వరకు ప్రయాణం చేస్తూ ఉంటారు.

సీతారామరాజుకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. మరో రెండు నెలల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సి ఉంది. రోజూ మాదిరిగానే గురువారం మిత్రుడితో కలిసి విజయవాడ బయలుదేరిన వీరు కనకదుర్గ వారధిపై అతి వేగంగా వెళ్తూ రోడ్డుపై జీబ్రా లైన్లు వేస్తున్న పెయింట్ డబ్బాలను ఢీకొట్టారు.

అచ్చం సినిమా సన్నివేశంలా..
బైక్ వేగానికి పెయింట్ డబ్బాలతో పాటు అందులో కలిపే టిన్నర్ సైతం ఎగిరి వీరి ఒంటి నిండా పడింది. అప్పటికే ఆ డబ్బాలలో కొంత కిరోసిన్ కలిపి ఉండడం, అది వీరి ఒంటిపై పడడంతో కంగారు పడ్డ వీరు దిచక్రవాహనాన్ని నియంత్రించలేకపోయారు. వారధిపై 8-9 ఖానాల నడుమ బండి అదుపుతప్పి కిందపడి దూసుకు వెళుతుండడంతో బండిలోని పెట్రోల్ ఒలికి రోడ్డుపై పడింది. బైక్‌పై ఉన్న ఇద్దరినీ తడిపేసింది.

ఆ సయంలోనే పల్సర్ వాహనం ఘర్షణకు రోడ్డుపై నిప్పులు చిమ్మడం, ఆ మంట వీరికి అంటుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. బాధితుల కేకలు విని సమీపంలోని వాహనదారులు, పెయింట్ వేస్తున్న వారు మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఎంతకీ మంటలు అదుపుకాలేదు. ఒంటిపై మంటల ధాటికి ఆర్తనాదాలు చేసిన బాధితులు ఒకానొక తరుణంలో కృష్ణా నదిలో దూకేందుకు ప్రయత్నించగా, స్థానికులు నిలువరించారు.

అటుగా వెళ్లే ప్రయాణికులు కార్లలో ఉన్న టవళ్లతో మంటలను అదుపు చేశారు. అప్పటికే సీతారామరాజు 90 శాతం కాలిపోగా, నారాయణ స్వామికి కొంతమేర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే సీతారామరాజు మృతి చెందగా, నారాయణ స్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

మరో రెండు నెలల్లో వివాహం కావాల్సిన కుమారుడు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసిన తాడేపల్లి ఎస్‌ఐ వినోద్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణ, తాడేపల్లి సీఐ చిట్టెం కోటేశ్వరరావు సందర్శించి వివరాలు సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement