అతివేగం..విషాదం
Published Thu, Aug 29 2013 1:17 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
శంషాబాద్, న్యూస్‌లైన్: బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ వద్ద బుధవారం లారీ, స్కార్పియో ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో జేపీ సిమెంట్ సంస్థ జాయింట్ వైస్ ప్రెసిడెంట్ పి.వి గోపాలకృష్ణన్ ఉన్నారు. అతివేగం, రోడ్డుపై మలుపులో వాహనాలు అదుపుతప్పడం వల్ల ఈ సంఘటన జరిగింది. ఆర్‌జీఐఏ ఠాణా ఎస్‌ఐ కాశీవిశ్వనాథ్ కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉన్న జేపీ సిమెంట్ కంపెనీ జాయింట్ వైస్ ప్రెసిడెంట్ పి.వి గోపాలకృష్ణన్ హైదరాబాద్‌లోని కంపెనీ కార్యాలయంలో మంగళవారం పనులు ముగించుకున్నారు. అక్కడి నుంచి సెలవుపై కేరళ రాష్ట్రంలోని సొంతూరు కున్నూరుకు వెళ్లేందుకు బుధవారం తెల్లవారుజామున స్కార్పియో వాహనంలో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు.
ఈ క్రమంలో శంషాబాద్ పట్టణంలో మలుపు వద్ద పొట్టు లోడుతో ఉన్న లారీ వేగంగా వచ్చి స్కార్పియో వాహనాన్ని ఢీకొంది. దీంతో కారు నడుపుతున్న మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన డ్రైవర్ లినేష్ (29) , వెనుక సీట్లో కూర్చున గోపాలకృష్ణన్(51) అక్కడికక్కడే మృతి చెందారు. అదే వాహనంలో ఉన్న మరో డ్రైవర్ కరీంనగర్ జిల్లాకు చెందిన జహీర్‌ఖాన్ (29)కు తీవ్ర గాయాలవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గోపాలకృష్ణన్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు.
Advertisement
Advertisement