
ఉల్లి కొంటే కన్నీరే!
ఉల్లి కోస్తే కాదు... ఇప్పుడు కొంటే కన్నీరు పెట్టాల్సి వస్తోంది. నిన్నమొన్నటి వరకూ కనీసం రూ. 15 లు దాటని దీని ధర ఒక్కసారిగా రెట్టింపవ్వడమే ఇందుకు కారణం.
♦ నిన్న కిలో రూ. 15... నేడు రూ. 30లు
♦ కలవరపడుతున్న వినియోగదారులు
♦ దిగుబడి తగ్గడంవల్లే ఈ పరిస్థితి
ఉల్లి కోస్తే కాదు... ఇప్పుడు కొంటే కన్నీరు పెట్టాల్సి వస్తోంది. నిన్నమొన్నటి వరకూ కనీసం రూ. 15 లు దాటని దీని ధర ఒక్కసారిగా రెట్టింపవ్వడమే ఇందుకు కారణం. అసలే నిత్యావసర సరకులు... కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుంటే ఇప్పుడు ఉల్లి సైతం ఆ జాబితాలో చేరడంతో జనం లబోదిబో మంటున్నారు.
సాలూరు: ఉల్లిపాయల ధర అమాంతంగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు గుండెలు బాదుకుంటున్నారు. నిన్న కిలో 15రూపాయలకే దొరికిన ఉల్లి, తెల్లారేసరికి రెట్టింపు కావడంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు కిలోలు కొనేందుకు బజారుకు వెళ్లిన మహిళలు, వ్యాపారులు చెబుతున్న ధరతో నోరెళ్లబెడుతున్నారు.
జిల్లాకు అవసరమైన ఉల్లి ఎక్కువగా కర్నూలునుంచే వస్తుంది. కాస్తోకూస్తో ఒడిశా నుంచి కూడా దిగుమతి చేసుకుంటూ వ్యాపారులు అమ్మకాలు చేస్తుంటారు. ఇతర రాష్ట్రాల్లో ఉల్లిపంటకు తీవ్ర నష్టం వాటిల్లడంతో, కర్నూలు నుంచి ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు ఊపందుకున్నాయి. దీనివల్లే ఇక్కడ ధరలు భారీగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లిపంట తీవ్రంగా నష్టపోవడంతో, దిగుబడులు తగ్గడంతోపాటు ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనట్టు తెలుస్తోంది.
నిల్వ చేసుకున్నవారికి కాసులు
అధికమొత్తంలో ఉల్లిని దిగుమతి చేసుకున్న వ్యాపారులకు ఒక్కసారిగా లాభాలు వచ్చిపడ్డట్టయింది. కర్నూలుæ మార్కెట్‌లో ధర పెంచేయడంతో స్థానిక మార్కెట్‌లో సైతం ధరను పెంచేసి అమ్మకాలు చేస్తున్నారు. కిలో రూ. 10ల నుంచి రూ. 12ల చొప్పున హోల్‌సేల్ ధరకు కొన్న వ్యాపారులు ఇప్పుడు స్థానిక మార్కెట్‌లో కిలో రూ. 30 లకు అమ్మడంతో రెట్టింపు లాభాలు వస్తున్నాయి.
కిలో రూ. 50కు చేరుతుందంట
మరికొద్ది రోజుల్లో కిలో ఉల్లి 50 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఉల్లివ్యాపారులు చెబుతున్నారు. స్థానిక మార్కెట్‌లో వున్న నిల్వలు అయిపోతే ఆ పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. విషయం మహిళల చెవికి చేరడంతో గగ్గోలు పెడుతున్నారు. గుట్టుగా ఏదో సంసారం సాగిస్తున్నామనుకుంటున్న వారు పెరిగిన ఉల్లిధరతో రోడ్డునపడినట్టయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటివరకూ టమాటాతోనే సతమతమైతే ఇప్పుడు ఉల్లికీ అదే పరిస్థితి ఏర్పడటంపై కలవరపడుతున్నారు.