సాక్షి, అమరావతి: నెట్టింట్లో పందెం కోడి కూత పెడుతోంది. సంక్రాంతికి నెల రోజుల ముందుగానే పుంజుల సందడి మొదలైంది. ఒకప్పుడు పల్లెలకే పరిమితమైన పుంజుల విక్రయం ఇప్పుడు ఆన్‌లైన్ స్థాయికి ఎదిగింది. పలు వెబ్‌పోర్టల్స్‌లో జాతి కోడి పుంజుల పేరుతో జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. ఉభయ గోదావరితోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలలో సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతుంటాయి. 60 ఏళ్ల క్రితం గోదావరి జిల్లాల్లో మొదలైన ఎడ్ల పందేలు క్రమంగా కోళ్ల డింకీ పందేల(కత్తుల కట్టకుండా) వైపు మళ్లాయి. 25 ఏళ్ల నుంచి పుంజులకు కత్తులు కట్టి బరిలోకి దించి డబ్బులు పందాలు వేసే పద్ధతి మొదలైంది. షామియానాలు వేసి ప్లడ్‌లైట్ల కాంతిలో కోడిపందాలు జాతరను తలపిస్తాయి.
పహిల్వాన్‌లను తలపించే పుంజులు...
పందాల కోసం కోడి పుంజులను ప్రత్యేక శిక్షణతో పెంచడం దాదాపు 15 ఏళ్ల నుంచి ప్రారంభమైంది. ఉదయాన్నే ఈత, వేడి నీటి స్నానం, అల్పాహారంగా కోడిగుడ్డు, వేటమాంసం, బాదం, పిస్తా, చోళ్లు, గంట్లు మేత. ఆరోగ్యం కోసం విటమిన్ టాబ్లెట్లు, పశుసంవర్థక శాఖ డాక్టర్లతో వారానికో పర్యాయం వైద్య పరీక్షలు.. ఇలా వీటి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు చాలానే ఉన్నాయి.
తరలివస్తున్న ప్రముఖులు
మూడు రోజుల కత్తుల సమరం కోసం కోడి పుంజులను ఏడాదిపాటు పహిల్వాన్‌ల తరహాలో అపురూపంగా సాకుతారు. బరిలో పందెం కోడి కాలుదువ్వి గెలిస్తే దాని ఆసామి విజయగర్వంతో మీసం మెలేస్తాడు. సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలను తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖులు తరలివస్తుంటారు.
గతేడాది క్యాష్‌లెష్.. ఈసారి ఆన్‌లైన్..
గతేడాది కోడి పందేలపై కోట్లాది రూపాయల బెట్టింగ్‌లకు పెద్ద నోట్ల రద్దు ఇబ్బందికరంగా మారడంతో క్యాష్‌లెష్ పందాలు జరిగాయి. నేరుగా నగదు మార్చకుండా ఆన్‌లైన్‌లో నగదు బదిలీ, కాగితాల్లో పందాల మొత్తాలు రాసుకుని బ్యాంక్‌ల ద్వారా లావాదేవీలు సాగాయి. ఈసారి ఆన్‌లైన్‌లో కోడి పుంజుల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఓఎల్‌ఎక్స్, క్విక్కర్, జెడ్‌ఎజెడ్‌స్పాట్ డాట్‌కామ్, పిఒఎస్‌ఒటిడాట్‌క్లాస్ తదితర వెబ్‌సైట్లలో పుంజుల ఫొటోలతో సహా అమ్మకాలకు పెట్టడం విశేషం. ఒక్కో పుంజు ధర కనీసం రూ.3,500 నుంచి రూ.50 వేల వరకు ఉంది. పుంజు పెంపకం, జాతి, రంగు, ఎత్తు, బరువును ప్రస్తావిస్తూ ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో అమ్మకాలు జరుగుతున్నాయి.
రెండు తరాలుగా అమ్మకాలే జీవనాధారం..
సంక్రాంతి సీజన్ కోసం ఏడాదిపాటు కష్టపడి కోడి పుంజులను పెంచుతాం. రెండు తరాలుగా కోడి పుంజుల అమ్మకాలపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మా నాన్న నుంచి మా అన్నదమ్ముల వరకు అంతా కోడి పుంజులను పెంచి అమ్ముకుంటున్నాం. ఈసారి పుంజులు కొనేవారి సంఖ్య తగ్గింది.
– తోట నర్సింహారావు, మచిలీపట్నం(కృష్ణా జిల్లా)
పందేలను చూసేందుకు రెండు కళ్లూ చాలవు
మా ప్రాంతంలో జాతరలా జరిగే కోడి పందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. కొందరు ముందుగానే పందెం కోళ్లు పెంచుతారు. మరికొందరు కొనుక్కుని పందాలు వేస్తుంటారు. ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా కూడా కొంటున్నారు.
– పుచ్చకాయల అబ్బులు, పెదగరువు(పశ్చిమగోదావరి)
Comments
Please login to add a commentAdd a comment