ఆన్‌లైన్ మాయ | Online delusion Grain Sold | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ మాయ

Published Tue, Mar 10 2015 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

Online delusion Grain Sold

 పాలకొండ: పరశురాంపురం గ్రామానికి చెందిన సీహెచ్ చిన్నారావు ఫిబ్రవరి 10న పాలకొండ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో 63 క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు. నెల రోజులు దాటినా బిల్లు చెల్లించలేదు. జిల్లా వ్యాప్తంగా వందలాది రైతుల దుస్థితి ఇదే. ధాన్యం విక్రయాలకు సంబంధించి బిల్లుల కోసం నెలల తరబడి బ్యాంకులు, కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. అధికారులు మాత్రం ఆన్‌లైన్‌లో మాయ చేస్తున్నారు. చెల్లింపులన్నీ పూర్తి చేసేశామని.. పెండింగు బిల్లులే లేవని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు.
 
 మరి తమ సంగతేమిటని బిల్లులు అందని రైతులు ఆందోళనగా ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా గ్రేడ్-1 రకం 351.86 క్వింటాళ్లు, సాధారణ రకం 4,47,675.75 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 31,957 మంది రైతుల నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు ఆన్‌లైన్‌లో పేర్కొన్నారు. వీటికి సంబంధించి రూ.609 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే రూ.470 కోట్లు రైతులకు చెల్లించారు. ఇంకా రూ.139 కోట్లు  చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు నిలిపేశారు. ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించినట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
 వాస్తవానికి ఈ ఏడాది రైతులు విక్రయించిన ధాన్యానికి బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగింది. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే సొమ్ము చెల్లిస్తారన్న జిల్లా అధికారులు, మంత్రుల హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. కొనుగోళ్ల ప్రారంభం నుంచే బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. మొదట్లో 20 రోజుల వ్యవధిలో బిల్లులు అందించారు. తర్వాత ఆ జాప్యం నెల రోజులకు పెరిగింది. ఇప్పుడు కొనుగోళ్లు నిలిచిపోయినా.. నెలలు దాటిపోతున్నా ఇంకా చెల్లింపులు జరగలేదు. కనీసం రైతులకు దానిపై స్పష్టత ఇచ్చే వారు కూడా కరువయ్యారు.
 
 తేలని రవాణా ఛార్జీలు
 రైతులు విక్రయించిన ధాన్యానికి రవాణా చార్జీల చెల్లింపు వ్యవహారం కూడా ఇప్పటికీ తేలలేదు. ఈ ఏడాది ధాన్యం తరలింపు బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే ధాన్యం తరలించడంలో కాంట్రాక్టర్లు విఫలం కావడంతో నేరుగా రైతులే సొంత ఖర్చులతో మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వింటాకు రూ.32 చొప్పున రైతులకు రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి రూ. 1.47 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులను కాంట్రాక్టర్లకు అందిస్తారా.. లేదా ధాన్యం తరలించుకున్న రైతులు చెల్లిస్తారా అన్న దానిపై ఇంతవరకు ఎటువంటి స్పష్టత లేదు. ప్రభుత్వ మౌనం వెనుక కాంట్రాక్టర్లకు నిధులు ధారాదత్తం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని కొంత మంది అధికారులు చెబుతున్నారు. రైతులు ఈ విషయాన్ని మరిచిపోయే స్థితికి తీసుకొచ్చి అనంతరం చెల్లింపులు చేయాలని అధికార పార్టీ నాయకులు సూచించినట్లు చెబుతున్నారు. కాగా రవాణా ఛార్జీలపై స్పష్టత ఇవ్వకపోతే మంత్రులు ఇళ్లును మట్టడిస్తామని రైతు సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement