ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తున్న ఇప్పటి రోజుల్లో కూడా మూఢ నమ్మకాలకు బలి అవుతున్నారు.
సాక్షి, గుంటూరు : ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తున్న ఇప్పటి రోజుల్లో కూడా మూఢ నమ్మకాలకు బలి అవుతున్నారు. చేతబడి, బాణామతి వంటివి చేశారనే అనుమానంతో ఎదుటి వ్యక్తులను హతమారుస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. జిల్లాలోని మారుమూల గ్రామాలతోపాటు, శివారు గ్రామాలు, తండాలలో మూఢనమ్మకాలు కనిపిస్తున్నాయి. ప్రమాణాల పేరుతో పెద్దలు పంచాయతీలు నిర్వహిస్తూ ఆచారం పేరుతో అరాచకాలకు పాల్పడుతూనే ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొద్దిపాటి వివాదం చోటు చేసుకున్నా, అనుమానాలు రేకెత్తినా ఆచారం పేరుతో ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డిని నిప్పుల్లో నుంచి తీయాలని, అలాతీస్తేనే అనుమానాలకు తావు ఉండదని నమ్ముతున్నారు.
అదేవిధంగా దొంగతనాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్న వ్యక్తిని బాగా మరిగించిన నూనెలో చేతులు పెట్టాలని, చేతులు కాలక పోయినట్లయితే దొంగతనం చేయనట్లుగా నిర్ధారిస్తూ పెద్దలు పంచాయతీలు నిర్వహించడం ఇప్పటికీ కొన్ని తండాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగితే తమకు ఎదుటి వారు చేతబడి చేయించారనే అనుమానంతో దాడిచేసి హతమార్చిన సంఘటన ఇటీవల వెలుగు చూసింది.
మాచర్ల మండలం తాళ్ళపల్లి గ్రామంలో చేతబడిపేరుతో ఓ వ్యక్తిని అమ్మ వారి గుడిముందు గొడ్డలితో నరికి చంపిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. 20 రోజులు ముందు పెద్దలు పంచాయతీ చేసినప్పటికీ ఈ హత్య జరగడం దారుణ విషయం. పోలీసులు తమకేమీ పట్టనట్లు వదిలేయడం వల్లే ఇంతటి అనర్థం జరిగిందని, ముందుగా ఇరువర్గాల వారిని హెచ్చరించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.
నిఘా నామమాత్రమే ...
శివారు గ్రామాలు, తండాల్లో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వ హిస్తూ ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరం ఉంది. కుల, మత పెద్దలు ఆచారాల పేరుతో మూఢ నమ్మకాలు పాటిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాలు, తండాలపై పోలీసులు దృష్టి సారించాలి. గ్రామం, తండాను పోలీసులు దత్తత తీసుకు నేలా చేసి ఎప్పటికప్పుడు ఆయా గ్రామాలు, తండాల్లో జరిగే సంఘటనలు ఉన్నతాధికారులకు తెలియజేయాలి. మూఢనమ్మకాలను పారదోలాలి.