
సచిన్ సభకు గ్రామస్తులకే అనుమతి
హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లా పర్యటనపై భద్రత సమీక్ష నిర్వహించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సచిన్ పాల్గొనే పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామ సభకు గ్రామస్తులను మాత్రమే అనుమతిస్తామని, ఇతరులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ రేఖా రాణి చెప్పారు.
సచిన్ ఈ నెల 16న నెల్లూరు జిల్లా పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామానికి రానున్నారు. గూడూరు నియోజకవర్గంలో ఉన్న పుట్టంరాజు వారి కండ్రిగను సచిన్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. మాస్టర్ రానున్న నేపథ్యంలో ఆ గ్రామంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సచిన్ ప్రతినిధులైన మనోజ్, నారాయణ ఇటీవల ఆ గ్రామానికి వచ్చి క్షుణ్ణంగా పరిశీలించారు.
మాస్టర్ పర్యటన మొత్తం సింపుల్‌గా జరగనుంది. ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా సాధారణంగా జరిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సచిన్ కేవలం దత్తత తీసుకున్న గ్రామాన్ని పరిశీలించేందుకు మాత్రమే వస్తున్నారని, మిగతా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనరని ఆయన ప్రతినిధులు తేల్చి చెప్పేశారు. సచిన్ కోసం అభిమానులు వేలల్లో వచ్చే అవకాశం ఉన్నందున వారందర్నీ కంట్రోల్ చేసేందుకు, ఎవ్వరూ అటువైపు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా తోపులాటలు, ఆయన్ను తాకేందుకు ఆస్కారం ఇవ్వరు. వీఐపీలు ఆయన్ను కలిసే ప్రయత్నం చేయకూడదు. కార్యక్రమం ముగింపు సమయంలో ఓ 10 నిమిషాలు గ్రామస్తులు ఆయనతో ఫొటోలు దిగేందుకు అవకాశం కల్పించవచ్చు. సచిన్ రాక నేపథ్యంలో ఆయన తిరిగే అన్నిచోట్ల బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు. బ్యారికేడ్ల మధ్యలో సచిన్, మరికొంత మంది మాత్రమే ఉండనున్నారు.