
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో సీవీఆర్ విద్యార్థులతో సచిన్ ముచ్చట్లు
నెల్లూరు జిల్లాలో అడుగిడిన క్రికెట్ దిగ్గజం
ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన సచిన్‌కు సాదర స్వాగతం...
కృష్ణపట్నం పోర్టులో కోలాహలం
ముత్తుకూరు: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తాను దత్తత తీసుకోనున్న పుట్టంరాజువారి కండ్రిగ గ్రామంలో ఆదివారం పర్యటించనున్నారు. దీంతో ఆ ఊరు అప్పుడే సంక్రాంతి శోభను సంతరించుకుంది. సచిన్ శనివారమే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు. గోపాలపురంలోని కేఎస్‌ఎస్‌పీఎల్ సెక్యూరిటీ కేంద్రానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన సచిన్‌కు పోర్టు ఎండీ శశిధర్, సీఈఓ అనిల్ ఎండ్లూరి పుష్పగుచ్ఛాలతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సచిన్ ప్రత్యేక వేదిక నుంచి సెక్యూరిటీ గార్డుల గౌరవ వందనం స్వీకరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సెక్యూరిటీ కేంద్రంలో మొక్కలు నాటారు. సీవీఆర్ కాంప్లెక్స్‌ను సందర్శించారు.
ట్రస్టు నిర్వహించే స్కూళ్ల విద్యార్థులతోముచ్చటించి, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. పోర్టు ఉద్యోగులు, స్థానిక యువకులు సచిన్‌ను చూసేందుకు, సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపటంతో సెక్యూరిటీ గార్డులు వారందరినీ నెట్టివేశారు. అనంతరం జేసీ రేఖారాణితో పాటు ప్రత్యేక కాన్వాయ్‌లో ఆయన పోర్టును సందర్శించారు. జరుగుతున్న అభివృద్ధిని పోర్టు నిర్వాహకులు ఆయనకు వివరించారు. ఆ తర్వాత చిల్లకూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బ తీరంలో పోర్టు యాజమాన్యానికి చెందిన ప్రత్యేక అతిధిగృహంలో సచిన్ బసచేశారు. ఆయన ఆదివారం నాడు తాను దత్తత తీసుకోనున్న పుట్టంరాజు వారి కండ్రిక గ్రామాన్ని సందర్శించనున్నారు.