జగన్‌ రాకతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు | Opponent Leaders Feared: Konatala Ramakrishna | Sakshi
Sakshi News home page

జగన్‌ రాకతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు

Published Thu, Sep 26 2013 2:16 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

జగన్‌ రాకతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు - Sakshi

జగన్‌ రాకతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు

* అందుకే అబద్ధపు ఆరోపణలు వైఎస్సార్‌ సీపీ నేతలు కొణతాల, సోమయాజులు ధ్వజం
* విజయమ్మ ఫోన్‌ చేశారని సోనియా మీకు చెప్పారా?
* చంద్రబాబు అవినీతి, మార్గదర్శి అక్రమాలు జేపీకి కనిపించలేదా?
* టీడీపీ, కాంగ్రెస్‌ల క్షుద్ర రాజకీయాల్లో ఆయన పావుగా మారారు
* జగన్‌పై కేసులు రాజకీయ ప్రేరేపితమని సుష్మాస్వరాజే అన్నారు
* డీల్‌ కుదుర్చుకునే అలవాటు చంద్రబాబు, బీజేపీలదే

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిలుపై బయటకు రావడంతో అధికార, ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అందుకనే టీడీపీ, బీజేపీలు ఆయనపై అబద్ధపు ఆరోపణలతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కోఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ, సభ్యులు డి.ఏ.సోమయాజులు పేర్కొన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయనకు లభించిన అశేష ప్రజాదరణను చూసి కొందరికి చాలా బాధ కలిగి విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ్‌ కూడా జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, టీడీపీ ఆడుతున్న క్షుద్ర రాజకీయ క్రీడలో పావుగా మారి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్‌కు బెయిలు వచ్చిన రోజు రాత్రి 12 గంటలకు సోనియాగాంధీకి విజయమ్మ ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలిపారని టీడీపీ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయం వారికెవరు చెప్పారు? కాల్‌ డేటా జాబితా ఏమైనా సంపాదించారా...? పోనీ గత రెండేళ్లుగా చంద్రబాబుతో కుమ్మకై్క రాజకీయాలు చేస్తున్నందు వల్ల సోనియాగాంధీయే వాళ్లకు ఈ విషయం చెప్పారా?’ అని వారు సూటిగా ప్రశ్నించారు.

దర్యాప్తు పూర్తయింది కనుకే బెయిల్‌ ఇచ్చారు
టీడీపీకి ఎందుకీ దుస్థితి...? ఎందుకిలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు నిలదీశారు. ‘సీబీఐ జాయింట్‌ డెరైక్టర్‌ లకీష్మనారాయణను మేమే బదిలీ చేయించినట్లు... ఆయన ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదన్నట్లు చెబుతున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారు?’ అని మండిపడ్డారు. ‘లకీష్మనారాయణ సీబీఐ జేడీగా ఉండగా జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే ఐదు సందర్భాల్లో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు కనుక బెయిల్‌ను మంజూరు చేయవద్దని కోర్టుకు నివేదించారు. వారి న్యాయవాది అశోక్‌భాన్‌కూడా ఇదే విషయం చెప్పారు.

దర్యాప్తు పూర్తి కాలేదనే ఒకే ఒక కారణంతో వారు జగన్‌ బెయిల్‌ను అడ్డుకుంటూ వచ్చారు. ఇపుడు దర్యాప్తు పూర్తయింది కనుక జగన్‌కు కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్‌ కోసం జగన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించినపుడు... దర్యాప్తు ముగియలేదని, సమయం కావాలని సీబీఐ కోరింది. వారి అభ్యర్థనను మన్నించిన సుప్రీంకోర్టు నాలుగు నెలల్లోగా దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ గడువును పాటించకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది కాబట్టి... అత్యున్నత న్యాయస్థానం విధించిన గడువుకు అనుగుణంగా సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసింది. దర్యాప్తు పూర్తయిందని చెప్పింది. దర్యాప్తు ముగిసినందున కోర్టు జగన్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. అసలు విషయం ఇదయితే... ఏమాత్రం బుద్ధి, ఇంగిత జ్ఞానం ఉన్నా జగన్‌ గురించి ఇలా మాట్లాడరు’ అని పేర్కొన్నారు.

రాజకీయ ప్రేరేపిత కేసులని బీజేపీ అగ్రనేతలే అన్నారుగా..?
‘జగన్‌ గతేడాది అక్టోబర్‌ 5న బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నపుడు 2013 మార్చి లోపుగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. మార్చి తరువాత బెయిల్‌ పిటిషన్‌ వేస్తే.. 70 శాతం పూర్తయిన దర్యాప్తులో రూ.1,030 కోట్ల మేర పెట్టుబడుల విషయాన్ని తేల్చామని సీబీఐ చెప్పటంతో మరో 4 నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు పూర్తి చేయడంతో బెయిల్‌ లభించింది. వాస్తవాలు ఇలా ఉంటే ఇంకా ఎందుకు మభ్యపెడుతున్నారు? ఎందుకింత దుష్ర్పచారం? ఎందుకిన్ని అబద్ధాలు?’ అని కొణతాల, సోమయాజులు నిలదీశారు.

సోనియాతో కుమ్మక్కు అయినందునే జగన్‌కు బెయిల్‌ వచ్చిందని బీజేపీ నేత నిర్మలా సీతారామన్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ‘జగన్‌పై కేసులు మోపినపుడు బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్‌ స్వయంగా ఇవి రాజకీయ ప్రేరేపితమైనవని.. జగన్‌ను వెంటాడి వేధించేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించిన సంగతి నిర్మలకు గుర్తు లేదా? ఆ పార్టీకే చెందిన మరో నేత అరుణ్‌ జైట్లీ చేసిన విమర్శలను మర్చి పోయారా?’ అని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నించారు.

బాబు అవినీతి, ఈనాడుపై కేసుల గురించి మాట్లాడరేం?
‘బీజేపీ నేతలు 1998లో చంద్రబాబుపై వంద ఆరోపణలతో ప్రకటించిన చార్జిషీటును ఆ తరువాత జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీడీపీ అధినేత మద్దతు కావాల్సి రావడంతో దాన్ని తుంగలో తొక్కిన ఘనత ఆ పార్టీదే. అలా లాలూచీ పడే అలవాట్లు వారికే ఉన్నాయి. బహుశా ఈ విషయం నిర్మలా సీతారామన్‌కు తెలియదేమో?’ అని కొణతాల, సోమయాజులు ఎద్దేవా చేశారు. సుపరిపాలన, పారదర్శకత అని చెబుతూ అవినీతిపై పోరాటం చేస్తున్నానని చెప్పుకునే జయప్రకాష్‌ నారాయణ్‌ తీరు మరీ విడ్డూరంగా ఉందన్నారు.

అవినీతిపై పోరుకు బదులు జగన్‌పై జేపీ వ్యక్తిగత పోరాటానికి దిగుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై జేపీ ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. మార్గదర్శి-ఈనాడు సంస్థలపై కేసుల విషయంలో ఎందుకు స్పందించరని నిలదీశారు. నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడ్డ రోజున చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ కేసులు కూడా అలాంటివేనని ఆయన్ను కూడా ఉరితీయాలన్నారని ఇపుడు జయప్రకాష్‌ కూడా జగన్‌ కేసులు నిర్భయ కేసుల్లాంటివేనని మాట్లాడటాన్ని బట్టి చూస్తే ఏమనుకోవాలన్నారు.

బాబు స్టే తెచ్చుకున్నప్పుడు జేపీ మాట్లాడలేదేం?
జగన్‌ కేసులను జేపీ చెప్పినట్లుగా ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులో విచారణ జరపడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అలా చేస్తే తొమ్మిది నెలలకే కేసు పూర్తయ్యేదని, జగన్‌కు 16 నెలల పాటు జైల్లో ఉండే అగత్యం తప్పేదని వైఎస్సార్‌ సీపీ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతిపై హైకోర్టు విచారణకు ఆదేశిస్తే వాటిపై ఆయన స్టే తెచ్చుకున్నపుడు జేపీ ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. ఐఏంజీ, ఎమ్మార్‌ కుంభకోణాల్లో బాబు చేసిన నిర్వాకంపై దర్యాప్తు జరిపించాలని జేపీ ఎందుకు డిమాండ్‌ చేయరని అడిగారు.

జగన్‌కు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన అన్ని చార్జిషీట్లలో కలిపి చేసిన ఆరోపణల మొత్తం రూ.1,200 కోట్లు మాత్రమేనని, అవి కూడా పెట్టుబడుల రూపంలో వచ్చినవేనన్నారు. కానీ బాబు చేసిన ఒక్క ఐఎంజీ వ్యవహారంలోనే రూ. 1,200 కోట్ల అవినీతి దాగుందని పేర్కొన్నారు. ఈనాడు-మార్గదర్శి సంస్థలపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చేసిన ఫిర్యాదుతో దర్యాప్తు జరిగితే ఇది వ్యాపార సంస్థలను భయపెట్టే చర్యగా నాడు జేపీ వ్యాఖ్యానించడాన్ని వారు గుర్తు చేశారు. ‘లెసైన్సు లేకుండా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించడం తప్పు అని రిజర్వు బ్యాంకు నోటీసులు జారీ చేస్తే... ఈనాడుపై జరుగుతున్న రాద్ధాంతం అంతా అంశాల్ని బట్టి కాకుండా చాలా వ్యక్తిగతంగానూ, క్షణికంగానూ అనిపిస్తోందని జేపీ ఆరోజు చెప్పారు.

డిపాజిటర్లు ఎవరూ ఫిర్యాదు చేయక పోయినా ఈ కేసును ఎందుకు సృష్టించి పెంచుతున్నారని ఆనాడు జయప్రకాష్‌ చెప్పారు. మరి ఈ విషయం జగన్‌కు వర్తించదా? జగన్‌ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు కూడా ఎవరూ ఫిర్యాదు చేయలేదు కదా? మరి కేసులు ఎందుకు పెట్టినట్లు?’ అని ప్రశ్నించారు. మార్గదర్శి అక్రమాలను సమర్థిస్తూ జేపీ మాట్లాడిన పత్రికా క్లిప్పింగ్‌లను వారు ప్రదర్శించారు. అవినీతి పోరులో జేపీకి చిత్తశుద్ధి ఉంటే అన్నింటిపై విచారణ జరపాల్సింగా కోరాలన్నారు. వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్‌ పథకాలను కూడా విమర్శించిన ఘనత జేపీదని వ్యాఖ్యానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement