
ప్రైవేటు స్కూల్ నుంచి సర్కారు బడిలో చేరిన విద్యార్థులకు ప్రవేశపత్రాన్ని ఇస్తున్న ఎమ్మెల్యే ముత్యాలనాయుడు
దేవరాపల్లి(మాడుగుల): ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని అప్పుడే సర్కారు బడులపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్ష ఉపనేత, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులను గురువారం స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే అభినందించారు. ఎంఈవో సిహెచ్. రవీంద్రబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, వారికి సహకరించిన తల్లిదండ్రులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుల పట్ల నమ్మకం సన్నగిల్లుతున్న తరుణంలో ఇది శుభపరిణామమన్నారు. ప్రస్తుతం ఉన్నత పదవుల్లో ఉన్నవారంతా గతంలో సర్కారు బడుల్లో చదివి ర్యాంకులు సాధించిన వారేనని పేర్కొన్నారు. విద్యాపరంగా సాయానికి తానెప్పుడూ ముందుంటానన్నారు.
తారువాలో మోడల్ గ్రంథాలయం.....
స్వగ్రామం తారువాలో అత్యాధునిక సౌకర్యాలతో మోడల్ గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. వచ్చే ఏడాదికి పనులు పూర్తయి వినియోగంలోకి వస్తుందన్నారు. రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ లాలం గంగా భవాని దీనికి నిధులు సమకూర్చారని చెప్పారు. ఈ గ్రంథాలయంలో గ్రూప్–వన్ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. వచ్చే ఏడాది పాలిటెక్నిక్ కోచింగ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 40 మంది కుర్చునేలా తరగతి గది , ల్రైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, కంప్యూటర్ రూమ్, ఈ బుక్స్ కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులను అభినందించారు. రెసిడెన్షియల్‌కు ఎంపికైన విద్యార్థులకు నోట్ పుస్తకం, పెన్నులు అందజేశారు.‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు బడిలో చేరిన విద్యార్థులకు ప్రవేశప్రతాలను ఎమ్మెల్యే అందజేశారు. సమావేశంలో సీఆర్పీలు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment