బీడుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో అధ్యాపక బృందం
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరుతూ గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. తమ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, క్వాలిఫైడ్ టీచర్లు తదితర అంశాలు తెలుపుతూ కరపత్రాలు ముద్రించి పంచుతున్నారు. వేలాది రూపాయల ఖర్చుతో ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపేకంటే రూపాయి ఖర్చులేని ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతున్న విషయంపై చైతన్యం తీసుకొస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చేరడం వల్ల అందే సంక్షేమ పథకాలపై కూడా ప్రచారం చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా పోటీ తత్వంతో పిల్లలను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా బోధనలాకాకుండా మనోల్లాసం కలిగిస్తూ.. ఒత్తిడి లేని చదువులతో పిల్లల సంపూర్ణ మానసిక వికాసానికి ప్రభుత్వ బడులు వేస్తున్న బాటలపై తల్లిదండ్రుల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
ఉత్సాహాన్ని నింపిన ‘పది’ ఫలితాలు
ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో అధికారులు, ఉపాధ్యాయుల్లో నూతనోత్సాహం నెలకొంది. 10/10 పాయింట్లు, వందశాతం ఉత్తీర్ణత సాధించడంలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు నిలిచాయి. కార్పొరేట్, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు 959 ఉండగా 516 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. వీటిలో 239 ప్రభుత్వ పాఠశాలలు ఉండడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో 221 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించారు. ఈ ఫలితాలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాయి. ఇదే ఉత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు నడుం బిగించారు. పట్టణాలు, పల్లెల్లో ఇంటింటా తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలంటూ తల్లిదండ్రులను కోరుతున్నారు. ప్రభుత్వ బడులు, ప్రైవేట్ బడులకు మధ్య తేడాలను వివరిస్తూ వారిలో చైతన్యం తీసుకువస్తున్నారు.
వేలాది రూపాయల మిగులు
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే తల్లిదండ్రులకు వేలాది రూపాయలు మిగులుతాయనే విషయంపై ప్రభుత్వ టీచర్లు సాగిస్తున్న ప్రచారంలో వాస్తవం లేకపోలేదు. ప్రైవేట్ స్కూళ్లలో రూ.10 వేల నుంచి 15 వేలు, కార్పొరేట్ స్కూళ్లలోనైతే ఇదే ఫీజును రెండింతలు చెల్లించుకోవాల్సి వస్తుంది. దీనికితోడు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు తదితర ఖర్చు అదనం. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే రూ.2,500 విలువ చేసే రెండు జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తారు. దాతల సహకారంతో నోట్ పుస్తకాలు కూడా ఉచితంగా అందుతుంటాయి. మధ్యాహ్నం పౌష్టికర ఆహారం పెడతారు. నిష్ణాతులైన టీచర్లతో విద్యాబోధన ఉంటుంది. క్వాలిఫైడ్ టీచర్లకు ఎక్కువ జీతం చెల్లించలేని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న వారితోనే సరిపెడుతుంటాయి. పాఠ్యాంశాల బోధనపై పట్టులేని వారు బట్టీ చదువులతో నెగ్గుకొస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యా బోధన శాస్త్రీయంగా ఉంటుంది. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో పాఠాలను బోధిస్తుంటారు. దీంతో పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం వల్ల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలవుతోంది.
ఆకట్టుకుంటున్న కరపత్రాలు, ఫ్లెక్సీలు
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలంటూ ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే చొరవ తీసుకుని వీటిని ముద్రించారు. తమ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు, వారి విద్యార్హతలు. పాఠశాలలోని మౌలిక వసతులు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, సంక్షేమ పథకాల వివరాలను ముద్రించిన కరపత్రాలతో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.
మంచి స్పందన లభిస్తోంది
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, క్వాలిఫైడ్ టీచర్లు, నాణ్యమైన బోధన తదితర వాటిపై కరపత్రాలు, ఫ్లెక్సీలు ముద్రించి చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటిదాకా గొల్లపల్లి, కొట్టాలలో పర్యటించాం. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్న తమ పిల్లలను అక్కడ మాన్పించి ప్రభుత్వ బడిలో చేర్పిస్తామంటూ తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. ఇది శుభపరిణామం.
– బొలికొండ చంద్రశేఖర్ హెచ్‌ఎం,బి.పప్పూరు జెడ్పీహెచ్‌ఎస్
Comments
Please login to add a commentAdd a comment