కృష్ణా: గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణపై రైతులు మండిపడుతున్నారు. తమ అభ్యంతరాలకు పరిష్కారాలు చెప్పకుండా అధికారలు అడుగుపెట్టడానికి వీల్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొసీజర్ పేరిట ఊళ్లలోకి వచ్చి హంగామాలు చేస్తే ఊరుకుని ప్రసక్తే లేదని హెచ్చరించారు. 'ప్రతీ దానికి ఎంత పరిహారం ఇస్తారు. భూమి కోల్పోతున్న వారికి ఎలాంటి న్యాయం చేస్తారన్న దానిపై స్పష్టమైన హామీలు తీసుకురండి'అని రైతులు తెలిపారు. దీనిపై స్పష్టత వచ్చిన తరువాతే భూములు ఇవ్వడంపై ఆలోచన చేస్తామన్నారు. అలాగే సరైన ప్రత్యామ్నాయాలు కూడా ప్రభుత్వం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విస్తరణ పేరిట ఇప్పటికే పలుమార్లు భూసేకరణ జరిపారని, విస్తరణ జరిగిన ప్రతీసారి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టం చేశారు. భూములపై ఆధారపడ్డ రైతులే కాదు.. ఉపాధి పొందుతున్న వారు కూడా కష్టాలు పడుతున్నారని రైతులు తెలిపారు. పేదల, బలహీన వర్గాల వారికి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కేసరపల్లిలో ఏడు ఎకరాల భూమిని మినహాయించాలని అధికారులకు మరికొంతమంది విజ్ఞప్తి చేయగా, దళితులు ఇళ్లను మినహాయించాలని కొందరు రైతులు పేర్కొన్నారు.