నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: ‘ప్రజా ఉద్యమానికి ఎంతటి వారైనా తల వంచాల్సిందే. మా పోరాటం, ఆరాటం భావి తరాల కోసమే. ఇప్పటికే ప్రత్యేక తెలంగాణ వాదులు సీమాంధ్రులపై చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అన్నిటికంటే ప్రమాదకరమైన అంశం నీటి సమస్య. విభజన జరిగితే జలయుద్ధం తప్పదు. తొందరపాటు నిర్ణయం
వల్ల సీమాంధ్ర తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా తెలంగాణ వాదాన్ని వెనక్కి తీసుకోవాలి. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’ అని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు, డీఆర్‌ఓ బి.రామిరెడ్డి స్పష్టం చేశారు. నగరంలో గురువారం సమైక్యాంధ్ర సింహగర్జన పేరుతో భారీ బహిరంగ నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు.
ప్ర:విభజన జరిగితే రైతులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
జవాబు: సీమాంధ్రలో పంటలు పండవు. ఎందుకంటే కృష్ణా, గోదావరి జలాలు ఈ ప్రాంతాలకు రావడం గగనమౌతుంది. ఎగువన తెలంగాణ , దిగువ సీమాంధ్ర ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రాజెక్ట్‌లు నిర్మిస్తే సీమాంధ్రులకు నీరెలా వస్తుంది?
ప్ర:హైదరాబాద్‌ను తెలంగాణలో కలిపితే నష్టం ఏంటి?
జవాబు: గత 56 ఏళ్లుగా హైదరాబాద్‌ను అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. హైదరాబాద్ తెలుగు ప్రజల రాజధానిగా భావిస్తున్నాం. అలాంటి నగరాన్ని తెలంగాణలో కలిపితే ఉద్యోగ,ఉపాధి అవకాశాలు సీమాంధ్రులకు దూరం అవుతాయి. రాష్ట్ర ఆదాయంలో 45 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వస్తోంది. అందువల్ల ఉద్యోగులకు జీతాలు సరిగా రావు. పింఛన్లను మరచిపోవాల్సిందే.
ప్ర:సమ్మెలో పాల్గొనడం వల్ల ఉద్యోగులు నష్టపోతారు కదా?
జవాబు: సమ్మె చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఎక్కువగా నష్టపోయేది ఉద్యోగులు,నిరుద్యోగులే. అందుకే లక్షలాది మంది ఉద్యోగులు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ప్ర:రాజకీయ నాయకులు ఎందుకు సహకరించడం లేదు?
జవాబు:సమైక్యాంధ్ర ఉద్యమానికి రాజకీయ నాయకులు సహకరించడంలేదన్నది వాస్తవమే. మా ఉద్యమంలోకి వారిని ఎప్పుడూ ఆహ్వానించలేదు. వారంతకు వారు స్వచ్ఛందంగా వస్తే కలుపుకుపోతాం.
ప్ర:విభజన జరిగితే..?
జవాబు: పూర్తిస్థాయిలో విభజనను ప్రకటిస్తే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షలకైనా సిద్ధమే.
ప్ర:జీతభత్యాలు లేకుంటే ఎలా ఉద్యమాన్ని కొనసాగిస్తారు?
జవాబు:ఉద్యమానికి నిధులు అవసరం లేదు. పోరాడితే పోయేది ఏదీ లేదన్న స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నాం. జీత భత్యాలు లేక పోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ అవి తాత్కాలికమే. జీతాల గురించి ఉద్యమకారులెవ్వరూ ఆలోచించడం లేదు.
ప్రశ్న: మీ పోరాటం ఎప్పటి వరకు?
జవాబు: సమైక్యాంధ్ర కోసం గత 36 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమం జరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలు సమైక్య నినాదంతో స్వచ్ఛందంగా రోడ్లపైకొచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. అందరి నినాదం ఒక్కటే. అదే ‘సమైక్యాంధ్ర’. దీనిని ప్రకటించే వరకు మా పోరాటం ఆగదు. అవిశ్రాంతంగా కొనసాగిస్తాం. ఇందులో భాగమే గురువారం నిర్వహించే సమైక్యాంధ్ర సింహగర్జన బహిరంగ సభ.
ఫొటో:04ఎన్‌ఎల్‌ఆర్-03,04-రామిరెడ్డి
భావితరాల కోసమే మా పోరాటం
Published Thu, Sep 5 2013 4:39 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement