సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ సేవలు అందుతున్నాయని, అధికార యంత్రాంగం స్పందిస్తున్న తీరు ఎంతో బాగుందని ఏవీఎం (అంజనీ విజయ మహిత) స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు అంజని యలమంచిలి పేర్కొన్నారు. అయితే కరోనా విషయంలో ప్రభుత్వం, వైద్యులపై దుష్ప్రచారం జరుగుతున్నట్లు తన స్వీయ అనుభవంలో తేటతెల్లమైందన్నారు. కోవిడ్ బారిన పడ్డ తన భర్త, కుమార్తె కోలుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం, స్థానికుల తోడ్పాటు మరువలేనిదన్నారు. విజయవాడలో ఏవీఎం స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి గత కొన్నేళ్లుగా చిన్నపిల్లలు, మహిళల రక్షణ, సామాజిక రుగ్మతలపై చైతన్యం చేస్తున్న అంజని ‘సాక్షి’తో మాట్లాడుతూ కరోనాపై తన అనుభవాలను వివరించారు.
► ఓ వీధిలో కరోనా వచ్చిందంటే ఆ దరిదాపులకు కూడా ఎవరూ వెళ్లని పరిస్థితి. ఉన్నట్లుండి రుచి, వాసన తెలియడం లేదని నా కూతురు ఓ రోజు బాంబు పేల్చింది. ఆ సాయంత్రమే మా వారికి జ్వరం వచ్చింది. ఇద్దరివీ అనుమానించదగ్గ లక్షణాలే కావడంతో కోవిడ్ టెస్ట్‌లు చేయించాం. ఇద్దరికీ పాజిటివ్ అని మర్నాడు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది.
► ఇంట్లో మిగతావారికి, పనివారికి పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది.
► మన ఇంట్లో వారికి కరోనా వచ్చిందనే భయం కంటే చుట్టుపక్కలవారు ఏమనుకుంటారో? సాటివారు ఎలా ప్రవర్తిస్తారో? స్నేహితులు, బంధువులు ఎలా చూస్తారో? అనే ఆందోళనే ఎక్కువగా బాధిస్తుంది.
► మావారు 30 ఏళ్లుగా శ్వాస సంబంధ (ఆస్తమా) బాధితులు. అలాంటి వారు కరోనా నుంచి కోలుకోవడం కష్టమనే అభిప్రాయం తప్పని రుజువైంది.
► వైద్యుల సూచనలతో మావారిని, కుమార్తెను ఇంట్లోనే (హోం ఐసోలేషన్) ఉంచి చికిత్స అందించారు. వైద్య ఆరోగ్యశాఖతోపాటు 8 డిపార్ట్‌మెంట్‌లకు చెందిన సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారు. వారిద్దరూ కోలుకునేవరకు ప్రభుత్వ యంత్రాంగం ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు ఆరా తీసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎంతో సానుకూల ధృక్పథంతో వివరించారు.
► మావారు రెండు వారాల్లోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోలుకున్నారు. కరోనా రోగుల పట్ల ప్రభుత్వ యంత్రాంగం చూపుతున్న కరుణను ప్రత్యక్షంగా చూశా. వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మనకు సేవలు చేస్తున్నారు.
కరోనా బాధితులకు అత్యుత్తమ సేవలు
Published Tue, Jul 21 2020 4:18 AM | Last Updated on Tue, Jul 21 2020 4:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment