ప్రొద్దుటూరులో పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేనున్నానని భరోసా కల్పిస్తూ.. మీ కష్టాలు.. కన్నీళ్లు తుడిచేందుకు రానున్నది రాజన్న రాజ్యం అంటూకొత్త ధైర్యాన్ని ఇస్తూ.. పాలకుల దౌర్జన్యాలు.. దుర్మార్గాలు.. కుట్రలు.. కుతంత్రాలు.. ఇంకానా ఇకపై సాగవని కుండబద్ధలు కొడుతూ.. కార్యకర్తల్లో నూతనోత్సాహం రేకెత్తిస్తూ.. సకల జనుల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ.. ప్రజా సంకల్ప యాత్రలో మూడు వేల కిలో మీటర్ల మైలురాయిని అధిగమించి అలుపెరుగని బాటసారిలా సాగిపోతున్నజననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, శ్రేణులు పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు.అన్నా.. నీ తోడుగా మేమున్నామంటూ నినదించారు.
సాక్షి, కడప : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర 3వేల కి.మీ పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. ఎక్కడికక్కడ మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షు డు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆయా నియోజకవర్గాలలో ప్రజలతో మమేకమయ్యారు. ఒకవైపు చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూనే... మరోవైపు నవరత్నాల గురించి ప్రజలకు తెలియజేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
తొండూరులో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాదయాత్ర
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 3వేల కి.మీ పూర్తయిన సందర్భంగా సోమవారం కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సంఘీభావ పాదయాత్ర ప్రారంభించారు. పైడిపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర బూచుపల్లె వరకు తొలి రోజు చేరుకోగా.. రెండవ రోజు మంగళవారం అక్కడ నుంచి క్రిష్ణంగారిపల్లెకు చేరుకుంది. కోరవానిపల్లె, మల్లేల, తొండూరు, ఇనగలూరు, సైదాపురం, మడూరు గ్రామాల వద్ద వైఎస్ అవినాష్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. తొండూరు – ఇనగలూరు మధ్య భారీ వర్షం కురిసినా వైఎస్ అవినాష్‌రెడ్డి ఏమాత్రం లెక్కచేయకుండా అలాగే ముందుకు కదిలారు. రైతులను, గ్రామస్తులను కలుస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. సింహాద్రిపురం మండల ఇన్‌చార్జి ఎన్.శివప్రకాష్‌రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.
కడపలో..
కడపలో ఉదయం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అంజాద్ బాషా, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబులతోపాటు పార్టీ శ్రేణులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం ముందుకు కదిలారు. అక్కడ నుంచి కోటిరెడ్డి సర్కిల్, ఎన్‌టీఆర్ సర్కిల్, కృష్ణా సర్కిల్, మాచుపల్లె బస్టాండు మీదుగా దేవుని కడపకు పాదయాత్ర నిర్వహించారు. అడుగడుగునా అందరితోనూ కలుస్తూ వారి సాదక బాధకాలు వింటూ ముందుకు సాగారు. వైఎస్ జగన్ 3వేల కి.మీ పాదయాత్రను పురస్కరించుకుని నేతలు కేక్‌ను కట్ చేశారు.
కమలాపురంలో..
కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు మండల కేంద్రమైన చెన్నూరులోని యల్లమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్రగా ముందుకు కదిలారు. అక్కడ నుంచి మైనార్టీ కాలనీ, ఎస్సీ కాలనీ, కుక్కరాయిపల్లె, శివాలిపల్లె క్రాస్, పుష్పగిరి క్రాస్, ఆదినిమ్మాయపల్లె, గాలివారిపల్లె, కొత్తపల్లె, వల్లూరు, యలాయిపల్లె మీదుగా నల్లపురెడ్డిపల్లె వరకు పాదయాత్ర చేపట్టారు. మధ్యలో శివాలిపల్లె క్రాస్ వద్ద కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబులు పాదయాత్రకు సంఘీభావం తెలిపి పాదయత్రలో పాల్గొన్నారు. అంతకుమునుపు వల్లూరులో ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
ప్రొద్దుటూరులో..
ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి రాజాజి రోడ్డు, దర్గా బజార్, సుందరాచార్యుల వీధి, గాంధీ రోడ్డు, హోమస్‌పేట, శివాలయం సర్కిల్, మైదుకూరు రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించిన అనంతరం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మధ్యలో మాస్టర్ కళాశాల విద్యార్థులు రాచమల్లుకు గులాబి పూలు అందించి మద్దతు పలికారు. వేలాది మందితో పాదయాత్ర సాగింది.
మైదుకూరులో..
మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండలం మొరాయిపల్లె నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నాగాయపల్లె, సిద్ధారెడ్డిపల్లె, బద్రిపల్లె, పుల్లారెడ్డి నగర్, కేతవరం, లక్ష్మిపేట, వీరభద్రాపురం మీదుగా అల్లాడుపల్లె వరకు ఎమ్మెల్యే పాదయాత్ర కొనసాగించారు. ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ.. మరోవైపు కేసీ కెనాల్ రైతులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ముందుకు కదిలారు.
రైల్వేకోడూరులో..
రైల్వేకోడూరు పరిధిలోని చిట్వేల్ రోడ్డులో ఉన్న తిమ్మశెట్టిపల్లె నుంచి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి వీవీ కండ్రిగ, తురకపల్లె, కొత్తపల్లె, ఉండాలపల్లె, గాంధీ నగర్, కేసీ అగ్రహారం, రెడ్డివారిపల్లె, సి.వరం, సోప్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర సాగింది. ఎమ్మెల్యే స్వగ్రామమైన రెడ్డివారిపల్లెలో గంగమ్మతల్లికి ఎమ్మెల్యే కొరముట్ల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
రాజంపేటలో..
రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటం నుంచి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి భాకరాపేట, చాముండేశ్వరి పేట, మాధవరం వరకు పాదయాత్ర సాగించారు. మధ్యలో కాశినాయన దేవాలయంలో ఆకేపాటి అమరనాథరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యకర్తలు, శ్రేణులు భారీ ఎత్తున పాలు పంచుకున్నాయి.
జమ్మలమడుగులో..
జమ్మలమడుగు నియోజకవర్గంలోని ముద్దనూరు మండలం ఉప్పలూరు నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పాదయాత్రగా బయలుదేరారు. కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కూడా ఆయనతో కలిసి నడిచారు.
Comments
Please login to add a commentAdd a comment