సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక పోరు దగ్గర పడుతుండడంతో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు... త మ భవిష్యత్తును పదిలం చేసుకునే దిశగా పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంటరీ సీటును ఆశిస్తున్న అధికార పార్టీ యువనేత కార్తీక్‌రెడ్డి ఐదు రోజులపాటు పాదయాత్ర నిర్వహించడం ద్వారా జిల్లా రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజేంద్రనగర్ అసెంబ్లీ సీటు రేసులో ఉన్న టీఆర్‌ఎస్ జిల్లా సారథి నాగేందర్‌గౌడ్ శుక్రవారం పాల్మాకుల నుంచి పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ యాత్ర నాలుగు రోజులపాటు నియోజకవర్గంలో కొనసాగుతుంది. యాత్ర ఉద్దేశం సంపూర్ణ తెలంగాణ సాధన కోసమేనని చెబుతున్నప్పటికీ, అంతర్లీనంగా మాత్రం తమ పట్టును నిలుపుకునేందుకేనని తెలుస్తోంది. మరోవైపు ఇదే పార్టీకి చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా త్వరలోనే పాదయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.
పాలమూరు-రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల రెండో వారంలో యాత్ర మొదలు పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నారు. సుమారు పది లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టు రంగారెడ్డి జిల్లా రైతాంగానికి జీవధారగా మారుతుందని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జూరాల నుంచి జిల్లా సరిహద్దు వరకు యాత్ర నిర్వహణకు సన్నిహితులతో తర్జనభర్జనలు పడుతున్నారు. ఇదిలావుండగా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా మహేశ్వరం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు సూత్రప్రాయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి కూడా మహేశ్వరం సెగ్మెంట్‌లో పాదయాత్ర నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ నేతలు యాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆశావహులు యాత్రలను వేదికగా మలుచుకుంటున్నారు.
యాత్రల కాలం!
Published Fri, Jan 17 2014 11:44 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement