సాక్షి, గుంటూరు :జిల్లాలోని పంచాయతీలు నిధులు లేక నీరసిస్తున్నాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు ఆలస్యంగా జరగడంతో కేంద్రం నిధులు సరిగా విడుదల చేయలేదు. అరకొరగా విడుదల చేసిన 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్‌ఎఫ్‌సీ) నిధులను బకాయిలు పేరుతో లాక్కుంటున్నారు. గత ఐదు నెలలు క్రితం కొత్తగా కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుంటే, మరో వైపు ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా అందిస్తామని ఆశలు చూపిన సర్కారు ఇప్పుడు మొండి‘చెయ్యి’ చూపుతోంది. ఇంతవరకు ఏకగ్రీవ పంచాయతీలకు అందించాల్సిన ప్రోత్సాహకాలు అందించలేదు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏకగ్రీవాలకు ఈ నిధులు అందుతాయో లేదోనని ఏకగ్రీవ పంచాయతీల్లోని పెద్దలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 162 ఏకగ్రీవ పంచాయతీలపై నాలుగు నెలల క్రితమే పంచాయతీ అధికారులు నివేదిక పంపించారు. ఇంతవరకు మేజరు, మైనరు పంచాయతీలకు రూ.లక్షల్లో అందించాల్సిన నజరానాలపై నోరు మెదపడం లేదు. గ్రామాల్లో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి ఫ్యాక్షన్ పల్లెల్లో శాంతి సుమాలు పూయించిన పెద్దలు, యువత చేసిన కృషి నీరుగారిపోతోంది. జిల్లాలోని 1,010 పంచాయతీలకు గత ఏడాది మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవ పంచాయతీలు అధికంగా తెనాలి డివిజన్‌లో ఉన్నాయి.
ఈ డివిజన్‌లోని ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నగరం మండలంలో ఫ్యాక్షన్ గ్రామమైన పెద్దవరం ఏకగ్రీవం అయింది. ఇక్కడి గ్రామస్తులంతా కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి పాటుపడ్డారు. అప్పట్లో ఏకగ్రీవ పంచాయతీలకు భారీ నజరానా అందిస్తామనే ప్రభుత్వ ప్రకటనతో పల్నాడు ప్రాంతంలోని గ్రామాలు ఏకగ్రీవ బాట పట్టాయి. 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మేజరు పంచాయతీలకు రూ.5 లక్షల వరకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించింది. ఈ మొత్తాన్ని 2013లో జరిగిన ఎన్నికల్లో పెంచుతామని ప్రకటించడంతో జిల్లాలో కక్ష్యలు, కార్పణ్యాలు నెలకొన్న గ్రామాలు ఏకగ్రీవ బాట పట్టాయి. తెనాలి డివిజన్‌లో 62, గుంటూరులో 37, నరసరావుపేటలో 57 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నాం...
పంచాయతీలకు అందించాల్సిన ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. ఏకగ్రీవం అయిన వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు పేర్కొన్నారు.
చెయ్యిచ్చారు !
Published Thu, Jan 9 2014 2:44 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement