ఒకవైపు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు అధికారులు సతాయిస్తున్నారు. నయానో భయానో చేసి భూసమీకరణ చేయాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కొక్క వీఆర్‌ఓకు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. రోజువారీగా ప్రగతి చెప్పాలని హుకుం జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సి ఉంటోందని, గ్రామాల్లోకి వెళ్లి భూసమీకరణ వేగవంతం చేయాలని ఆదేశిస్తున్నారు. గ్రామాల్లోకి వస్తే ఇబ్బందులు పడతారని ఇంకోవైపు ప్రజలు హెచ్చరిస్తున్నారు. దీంతో ముందుకెళ్తే నుయ్యి..వెనక్కి వెళ్తే గొయ్యి..అన్నట్లు తయారైంది వీఆర్‌ఓల పరిస్థితి. ఇటు అధికారులు, అటు ప్రజల మధ్య తీవ్రస్థాయిలో అడకత్తెరలో పోకచెక్కలా వీఆర్‌ఓలు నలిగిపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:భోగాపురంలో ఎయిర్ పోర్ట్ కోసం చేయాల్సిన భూ సమీకరణ వీఆర్‌ఓల మెడపై కత్తిలా ఉంది. ప్రభుత్వం చెప్పినదానికల్లా ఉన్నతాధికారులు ఊకొడుతున్నారు. భూసమీకరణ చేసేస్తామని హామీలిచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన వీఆర్‌ఓల సాధకబాధకాలను తెలుసుకోకుండా ఏకపక్ష ఆదేశాలిస్తున్నారు. ‘యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లోకి వెళ్లండి...ఏదో ఒకటి చేసి భూసమీకరణకు రైతుల్ని ఒప్పించండి....మం డల కార్యాలయానికి తీసుకొచ్చి అంగీకార పత్రంపై రైతులతో సంతకం చేయించండి... నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలి... రోజుకెంతమంది నుంచి అంగీకారం తీసుకు న్నారో ప్రగతి నివేదిక ఇవ్వాలి.’ అంటూ వీఆర్‌ఓలను ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది.
వీఆర్‌ఓలు కొంత ప్రగతి సాధించాక ల్యాండ్ పూలింగ్ కోసం ప్రత్యేకంగా నియమించిన 10బృందాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. అయితే, భూ సమీకరణ ప్రారంభంలో వీఆర్‌ఓలే ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. భూసమీకరణ పేరు తో వస్తే అడ్డుకుంటామని, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వీఆర్‌ఓలు ఎక్కడికెళ్లినా వ్యతిరేకతే తప్ప సానుకూలత కన్పించడం లేదు. దీంతో గుట్టుగా ఒకరిద్దరిని కలిసి రావడం తప్ప వీఆర్‌ఓలు చేసిందేమీ ఉండడం లేదు. రైతులెవ్వరూ భూములిచ్చేందుకు సానుకూలతే చూపనప్పుడు అంగీకారం పత్రాలపై సంతకాలెలా చేయించగలమన్న డైలమాలో వీఆర్‌ఓలు పడ్డారు.
ఈ పరిణామాలను ఉన్నతాధికారులు అర్థం చేసుకోవడం లేదని వీఆర్‌ఓలు ఆవేదన చెందుతున్నారు. ఎంతసేపూ లక్ష్యాలు, ప్రగతి నివేదికలు తప్ప వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం లేదని, నాలుగు గోడల మధ్య కూర్చుని ఆదేశిస్తే అయిపోదని కొందరు వీఆర్‌ఓలు మధనపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే 15వేల ఎకరాలు కాదు కదా 100ఎకరాలు కూడా సమీకరించలేమన్న అభిప్రాయంతో ఉన్నారు. కరపత్రాల పంపిణీ, పోస్టర్లు అతికిస్తేనే ఊరుకోని జనాలు అంగీకార పత్రాలపై సంతకాలెలా చేస్తారని వారిలో వారు ప్రశ్నించుకుంటున్నారు. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటే తప్ప అధికారులొచ్చినా ఏం చేయలేరని, ప్రజలకు నచ్చచెప్పే ఏదైనా చేయాలని, స్వచ్ఛందంగా ఇస్తే పర్వాలేదు..లేదంటే బలవంతంగానైనా లాక్కుంటామంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదని వారంతా మనసులో మాటను నర్మ గర్భంగా చెబుతున్నారు.
దిక్కుతోచక..!
Published Fri, Apr 24 2015 4:23 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement