ఇంటి ముందు కారు
ఇంటి ముందు కారు
Published Sun, Mar 16 2014 2:02 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ : మూడు వందల గజాల స్థలంలో ఇంద్రభవనం లాంటి ఇల్లు.... ఆ రూ.కోటిన్నర విలువైన ఇంటిలో కళ్లు చెదిరి పోయే ఫర్నిచర్, ఇంటి ముందు రూ. లక్షల విలువైన కారు. సాధారణంగా ఒక గజిటెడ్ ఉద్యోగి ఇంట్లో ఉండాల్సిన బీరువాను.. ఈ ఇంటి బయట చెప్పులు పెట్టుకునేందుకు వినియోగిస్తున్నారు. ఇవేవో సినిమాలో పెద్దింటి హీరో కుటుంబ నేపథ్యాన్ని తెలియజేసే పరిచయ వాక్యాలు కావు... కేవలం నెలకు రూ. 16వేలు జీతం పొందే ఓ చిరుద్యోగి విలాస నివాసం రూపురేఖలు. ఇంటిని చూసిన ఏసీబీ అధికారులకు నోటమాటరాలేదు. భోగాపురం మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ దేవ పుష్పలత....తన భూమికి సంబంధించిన అడంగల్‌లో తప్పులు సరిచేయాలని కోరుతూ భోగాపురం మండలం నందిగాం వీఆర్‌ఓగా, భోగాపురం మండలం కేంద్రం తూర్పు ఇన్‌చార్జ్ వీఆర్‌ఓగా బాధ్యతలను నిర్వహిస్తున్న డి.రామకృష్ణను ఆశ్రయించారు.
అయితే పని చేయకుండా చాలా సార్లు తిప్పించుకుని అడంగల్‌లో తప్పులు సవరించేందుకు రూ.50 వేలు లంచం అడిగారని పుష్పలత ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు పుష్పలత శనివారం ఉదయం పట్టణంలోని రింగ్‌రోడ్డు టౌన్ లే అవుట్‌లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లారు. పుష్పలత నుంచి వీఆర్‌ఓ రామకృష్ణ రూ.50వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ సందర్భంగా ఇంటిని పరిశీలించిన వారు ఆశ్చర్యపోయారు. ఓ చిరు ఉద్యోగి ఇంత పెద్ద భవనంలో నివాసం ఉండడాన్ని చూసి నోళ్లు వెళ్లబెట్టారు. కారు, కారుకోసం ప్రత్యేకంగా షెడ్, ఇంటి నిర్వహణ తీరు చూస్తుంటే ఆ వీఆర్‌ఓ వ్యవహారం అర్థమవుతోందని వారు తెలిపారు. ఓ చిరుద్యోగి వేలల్లో లంచం అడిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, భోగాపురం మండలవాసులు ముక్కున వేలేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సి.హెచ్.లక్ష్మీపతి ఆధ్వర్యంలో సీఐలు ఎస్.లక్ష్మోజీ, డి,రమేష్‌లు దాడులు నిర్వహించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ లక్ష్మీపతి తెలిపారు.
Advertisement
Advertisement