సాక్షి, హైదరాబాద్/తుర్కయంజాల్: ఓ రైతుకు సంబంధించిన భూమిని మ్యుటేషన్ చేసేందుకు వీఆర్వో రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) చేతికి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కమ్మగూడలో గురువారం ఈ ఘటన జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గుర్రంగూడకు చెందిన రైతు ముత్యంరెడ్డి తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలో కొంతకాలం క్రితం ఎకరం 29 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమికి సంబంధించిన మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మ్యుటేషన్ చేయాలని రైతు ముత్యంరెడ్డి వీఆర్వోను ఆశ్రయించగా, రూ.1 లక్ష లంచం ఇవ్వాలని వీఆర్వో శంకర్ డిమాండ్ చేశాడు. అంతడబ్బు ఇవ్వలేనని, రూ.70 వేలు ఇస్తానని రైతు వీఆర్వోకు చెప్పాడు. అనంతరం ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం తెలిపాడు.
ఈ మేరకు వీఆర్వోను పట్టుకోవాలని ఏసీబీ అధికారులు పథకం పన్నారు. గురువారం రూ.50 వేలను రైతు ముత్యంరెడ్డి తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలోని వీఆర్వో కార్యాలయంలో శంకర్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. అధికారులు ఎవరైనా పనులు చేసేందుకు లంచం డిమాండ్ చేస్తే తమను ఆశ్రయించాలని 94404 46140 నంబర్‌లో ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సూచించారు. కాగా, వీఆర్వో శంకర్ రెండు నెలల క్రితమే తొలిసారిగా బాధ్యతలు తీసుకున్నారు. అంతలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment