ప్రతీకాత్మక చిత్రం
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): పట్టా భూమి పేరు మార్పునకు లంచం డిమాండ్ చేసిన వీఆర్‌వోకు ఏడాది, ఆయన అసిస్టెంట్‌కు ఆర్నెళ్లపాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం ఏసీబీ కోర్టు కరీంనగర్ ప్రత్యేక న్యాయమూర్తి భాస్కర్‌రావు తీర్పు చెప్పారు. బీర్కూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన వెన్నం వెంకట్రామయ్య 1970లో మిర్జాపూర్ శివారులో 5.20 గుంటల భూమిని సబ్బిడి భూమయ్య, సబ్బిడి విఠల్‌ల నుంచి కొన్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు. ఈయన మరణాంతరం 5.20 గుంటల వ్యవసాయ భూమిని అన్నలిద్దరు తమతమ పేర్లమీదకు మార్చుకోగా చిన్నవాడైన వెన్నం రామకృష్ణ తన భాగం భూమిని తన పేరుమీదకు మార్చేందుకు 28 జనవరి 2009న మిర్జాపూర్ వీఆర్‌వో కొమ్ము మురళికి దరఖాస్తు చేశాడు. అందుకు వీఆర్‌వో తనకు రూ.2100లు లంచం ఇస్తేనే విచారించి తహసీల్దార్‌కు నివేదిక ఇచ్చి పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ ఇప్పిస్తానని, లేదంటే కుదరదని చెప్పాడు.
అనంతరం వీఆర్‌వో కొద్దిరోజుల తర్వాత పాస్‌బుక్ టైటిల్ డీడ్‌లు సిద్ధంగా ఉన్నాయని, 26 ఫిబ్రవరి 2009న లంచం డబ్బులు తనను ఇంట్లో కలిసి ఇచ్చి వాటిని తీసుకెళ్లాలని చెప్పాడు. దాంతో రామకృష్ణ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అదే రోజు ఏసీబీ అధికారులను కలిసి వీఆర్‌వోపై ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడు రామకృష్ణ వీఆర్‌వోకు లంచం డబ్బులు ఇవ్వగా ఆయన ఆ డబ్బులను తన అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఇచ్చి దగ్గర పెట్టుకోవాలని చెప్పాడు. శ్రీనివాస్ డబ్బులు లెక్క పెడుతుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు వారిని రెడ్‌హాండ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో బుధవారం ఏసీబీ తరపున ప్రత్యేక పీపీ లక్ష్మీప్రసాద్ వాదనలు వినిపించారు. ఇరువార్గల వాదనలు విన్న న్యాయమూర్తి భాస్కర్‌రావు వీఆర్‌వో మురళీకి ఏడాది, రూ.5వేలు, అతడి అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఆర్నెళ్ల శిక్ష, రూ. 2500లు జరిమానాలు విధిస్తూ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment