
సాక్షి, చీరాల (ప్రకాశం): ప్రస్తుతం చీరాల టీడీపీ నేతలు వలస నేతలతో నిండిపోయింది. పదుల సంఖ్యలో వాహనాల్లో వలస నేతలు హల్‌చల్ చేస్తున్నారు. ఎక్కడి వారో, ఊరివారో తెలియదు కాని చీరాల నియోజకవర్గాన్ని వలస నేతలు తిప్పేస్తున్నారు. ఒంగోలు, అద్దంకితో పాటు కొందరు హైదరాబాద్ నుంచి కూడా దిగుమతి అయ్యారు. పట్టణంలోని 33 మున్సిపల్ వార్డులతో పాటు నియోజకవర్గంలోని 24 గ్రామ పంచాయతీలకు వలస నాయకులనే ఇన్‌చార్జులుగా నియమించారు. కార్యకర్తలకు అవసరమైన రోజువారీ ఖర్చులు, ఓటర్ల జాబితాలు పట్టుకుని వార్డు, గ్రామం ఇన్‌చార్జులమని స్థానిక టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. దీన్ని ఎప్పటి నుంచే టీడీపీని అంటిపట్టుకున్న టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రతిసారీ అన్నీతామై చూసుకునే మేము ఈ ఎన్నికల్లో మాత్రం వలస నేతలు చెప్పిందే చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. టీడీపీ చీరాల అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరణం బలరాంను చీరాల అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిన వెంటనే అద్దంకి నుంచి రాజకీయాలు నిర్వహిస్తున్న బలరాంను ఆగమేఘాల మీద చీరాలకు పంపించారు. అప్పటి వరకు చీరాల టీడీపీలో బీసీ నినాదం నడుస్తోంది. పలువురు బీసీ నేతలు టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే బీసీ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన బలరాంనే చీరాలకు కేటాయించారు. దీంతో వలస నేతల ప్రభావం పెరిగిపోయింది.
ఇతర ప్రాంతాల నుంచి చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు చీరల్లో నాయకులుగా చలామణి అవుతున్నారు. బలరాం కూడా స్థానిక నేతలతో కాని, గ్రామస్థాయి క్రియాశీలక నేతలతో పరిచయాలు లేకపోవడంతో ఎన్నికల నిర్వహణపై స్థానిక నేతలను నమ్ముకోకుండా కేవలం బలరాం తనకున్న ముఖ్యమైన వ్యక్తులందరిని చీరాలకు తీసుకువచ్చి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. వారినే గ్రామాలకు, వార్డులకు ఇన్‌చార్జులుగా నియమించుకుని పార్టీ కార్యకలాపాలను చేయిస్తున్నారు. ఎన్నికల్లో కార్యకర్తలతో మాట్లాడంతో, డబ్బుల పంపకాలు, ప్రచార వ్యవహారాలను వారే నిర్వహిస్తుండటంతో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్థానిక నేతలు నొచ్చుకుంటున్నారు. ఇన్నేళ్లుగా టీడీపీ కోసం పనిచేసిన తమను కాదని బయటి ఊర్ల నుంచి వచ్చిన వలస నేతలను తమపై పెత్తనం చెలాయించేలా చేయడం ఏటని బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.