కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గమనిక.. బస్సు ఎక్కబోతూ ఒక్కసారి జేబు తడుముకోండి. మీ దగ్గర ఉన్న డబ్బులు టికెట్ సరిపడ ఉన్నాయో లేదో చూసుకోండి.. వీలయితే చార్జీ ఎంతో కండెక్టర్‌ను అడిగి బస్సెక్కండి. ఆర్టీసీ సంస్థ చార్జీలు పెంచింది. ఈ చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు రెండు నెలల పాటు విధులు బహిష్కరించి సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో కర్నూలు రీజియన్‌కు రూ. 55 కోట్లు నష్టం వాటిల్లింది. సీమాంధ్ర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో నష్ట నివారణ చర్యలకు యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది. అయితే ఈనెల 1వ తేదీ నుంచి మళ్లీ డీజిల్ ధరను లీటరుపై 50పైసలు పెంచడం సంస్థపై కోలుకోలేని దెబ్బపడింది. అయితే డీజిల్‌పై విధించే రాష్ట్ర ప్రభుత్వ పన్ను నుంచి ఆర్టీసీకి మినహాయింపు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు కోరినా స్పందించని ప్రభుత్వం చార్జీలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు సోమవారం అధికారికంగా ప్రకటన వెలువడింది.
ఈనెల 6వ తేదీ (అర్ధరాత్రి నుంచే) కొత్త చార్జీలను అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. కొత్త చార్జీల వివరాలను రీజినల్ మేనేజరు కృష్ణమోహన్ మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని 11డిపో మేనేజర్లకు పంపింంచారు. దీంతో ఆయా డిపో పరిధిలోని బస్సులు తిరిగే రూట్లలో బస్ చార్జీలను సవరించారు. పంచింగ్ టికెట్‌లపై కొత్త చార్జీల ధరను స్టాంప్ ముద్ర వేయించారు. టిమ్ (టికెట్ ఇష్యూ మిషన్) వినియోగంలోని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఆన్‌లైన్ సాఫ్ట్ వేర్ ద్వారా కంప్యూటర్‌లో సవరించి మిషన్లలో సాఫ్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేశారు.