
రైల్వే టీటీఈని కొట్టి చంపిన ఇద్దరు ప్రయాణికులు
ఎమ్మిగనూరు : రైల్లో నీటి కోసం జరిగిన చిన్న వివాదం ముదిరి ఓ రైల్వే టీసీ ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్) మరణానికి దారితీసింది. బుధవారం అర్థరాత్రి 12.45 గంటల సమయంలో కర్నూలు జిల్లా మంత్రాలయం (తుంగభద్ర) రైల్వే స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. చెన్నై నుంచి షిర్డీకి వెళుతున్న ఈ రైలు (నెం.22601)లో ధర్మవరం నుంచి వాడి ప్రాంతం వరకూ విధుల నిర్వహణ బాధ్యత టీసీ సంజీవయ్య (55)ది.
ఏసీ కోచ్లో నీరు లేదంటూ రాత్రి 12.30 గంటల సమయంలో పలువురు ప్రయాణికులు టీసీతో వాగ్వాదానికి దిగారు. తుంగభద్ర రైల్వేస్టేషన్లో నీరు తెప్పిస్తానని... అప్పటి వరకు ఓపిక పట్టాలని టీసీ వారికి సూచించారు. రైలు తుంగభద్రకు చేరుకున్న సమయంలో సంజీవయ్య కిందకు దిగి స్టేషన్ లోపలికి వెళుతుండగా కొందరు ప్రయాణికులు మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదారు.
దాంతో టీసీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అనంతపురం జిల్లా ధర్మవరం వాసి. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ప్రయాణికులు వంశీకృష్ణ , అమ్రేష్బాబులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే టీటీఈ తమను రూ. కోటి రూపాయిలు డిమాండ్ చేశాడనే నెపంతోనే చంపామాంటూ నిందితులిద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.