పాస్‌పోర్ట్ మేడ్ ఈజీ...
నేడు రెండో సేవా కేంద్రం ప్రారంభం
మరింతమందికి అవకాశం
మర్రిపాలెం (విశాఖ): విశాఖలో మరో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అందుబాటులోకి వస్తోంది. మర్రిపాలెం ఉడా లే అవుట్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం-2 మంగళవారం ప్రారంభం కానుంది. పాస్‌పోర్ట్ దరఖాస్తుల రద్దీ, తాకిడి దృష్ట్యా మరో సేవా కేంద్రం అవసరమని అధికారులు గుర్తించారు. ఆ దిశగా ప్రతిపాదనలు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ శాఖకు అవసరం తెలియజేశారు. ఇక్కడి కేంద్రంలో వసతులు, కౌంటర్‌ల విషయాన్ని కేంద్రానికి అందచేశారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సేవలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే కేంద్రం సిద్ధమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ఏడాది జనవరిలో విశాఖ ప్రాంతీయ కేంద్రంగా అవతరించింది. విశాఖకు అనుబంధంగా విజయవాడ, తిరుపతిలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆగస్టు 2011 నుంచి మురళీనగర్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో ప్రజలు సేవలు పొందుతున్నారు.
ఇక్కడి కేంద్రంలో 18 కౌంటర్‌లు పనిచేస్తుండగా రోజుకు 975 దరఖాస్తులు పరిశీలించి స్వీకరిస్తున్నారు. ఇకపై అదనంగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రం-2 పేరుతో మర్రిపాలెం ఉడా లేఅవుట్ దరి పాస్‌పోర్ట్ కార్యాలయ భవనం మొదటి అంతస్తులో సేవా కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కార్యాలయంలో ప్రత్యేక వసతులు, అన్ని హంగులు కల్పించారు. 10 కౌంటర్‌లు ఏర్పాటుచేసి రోజుకు 450 మందికి అవకాశం కల్పిస్తారు.