మా సేవలు ఓకే నా...?
పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు పోలీసు శాఖ ఫోన్లు
ప్రత్యేకంగా కాల్‌సెంటర్ ఏర్పాటు చేసిన సిటీ కమిషనర్
ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సిబ్బందికి కౌన్సెలింగ్
తీవ్ర ఆరోపణలు వచ్చిన ఏడుగురిపై ఎటాచ్‌మెంట్ వేటు
సిటీబ్యూరో: పాస్‌పోర్ట్... ఇది విదేశాలకు వెళ్లేందుకు కావాల్సిన కీలకమైన గుర్తింపు పత్రం. అయినప్పటికీ నగరంలో అనేక మంది దాని అవసరం వచ్చే వరకు దరఖాస్తు చేసుకోవట్లేదు. అలా దరఖాస్తు చేసిన వారికి ఏదైనా కొర్రీ పడి పాస్‌పోర్ట్ ఆగిపోతుందేమోనన్న ఆందోళన ఉంటుంది. వెరిఫికేషన్‌కు వచ్చే స్పెషల్‌బ్రాంచ్ సిబ్బంది ఇలాంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని... దరఖాస్తుదారులను డబ్బు డిమాండ్ చేయడం వంటివి చేస్తున్నారు. వీటికి పూర్తి స్థాయిలో చెక్ చెప్పడానికి నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి సిటీ కమిషనరేట్‌లోని కాల్‌సెంటర్‌లో ఏర్పాట్లు చేశారు. అక్కడి సిబ్బంది దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి ఫీడ్ బ్యాక్ తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. కాగా, శాంతి, భద్రతల విభాగం పని తీరుపైనా ఇప్పటికే ఇలాంటి ఫీడ్ బ్యాక్‌ను తీసుకుంటున్న విషయం తెలిసిందే.
నిబంధనలు పక్కాగా పాటించాల్సిందే...
పాస్‌పోర్ట్ జారీకే కాదు.. వెరిఫికేషన్‌కూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లే స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది వీటిని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. పాటించని సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు పాస్‌పోర్ట్ దరఖాస్తు రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి స్పెషల్ బ్రాంచ్ కార్యాలయానికి చేరిన వెంటనే దరఖాస్తుదారుడికి ఓ సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్) వస్తుంది. మీ దరఖాస్తును ఫలానా సిబ్బంది వెరిఫై చేస్తారని, దీని కోసం ఆయన నిర్ణీత సమయానికి ముందు మీకు ఫోన్ చేసి పత్రాలు సిద్ధంగా ఉంచకుకోవాలని చెప్తారని ఉంటుంది. దీన్ని పాటించకుండా హఠాత్తుగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లడం, ఆ సమయంలో ఇంట్లో లేరనో, మరో కారణంతోనో ఇబ్బందులు పెడుతున్న సిబ్బందినీ అధికారులు ఉపేక్షించట్లేదు.
ర్యాండమ్‌గా 10 శాతం చెకింగ్స్...
నగర స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిత్యం భారీ సంఖ్యలో దరఖాస్తుల్ని వెరిఫై చేసి, నివేదికల్ని పాస్‌పోర్ట్ కార్యాలయానికి పంపుతుంటారు. ఇలా ప్రతి దరఖాస్తుదారుడినీ సంప్రదించి, ఫీడ్ బ్యాక్ తీసుకోవడం కష్టసాధ్యం. దీన్ని పరిగణలోకి తీసుకున్న కమిషనర్ మహేందర్‌రెడ్డి ర్యాండమ్ చెకింగ్ విధానాన్ని అమలు చేయిస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు క్లియర్ చేస్తున్న దరఖాస్తుల వివరాలు ప్రతి రోజూ కమిషనరేట్‌లోని కాల్ సెంటర్‌కు చేరతాయి. వీటి నుంచి ర్యాండమ్‌గా 10 శాతం మంది వివరాలను ఎంపిక చేసే కంప్యూటర్ కాల్‌సెంటర్ ఉద్యోగులకు అందిస్తుంది. వాటిలో ఉన్న నెంబర్ల ఆధారంగా వారికి ఫోన్లు చేసి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు.
12 ప్రశ్నలతో ఫ్రొఫార్మా... గ్రేడింగ్...
కాల్ సెంటర్ ఉద్యోగులు దరఖాస్తుదారుడిని 12 కేటగిరీలకు చెందిన ప్రశ్నలు అడుగుతున్నారు. స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నిబంధనలు పాటించారా?, వారి ప్రవర్తన, మాట తీరు ఎలా ఉంది? మీ దగ్గర డబ్బు డిమాండ్ చేశారా? వారు అడగకపోయినా మీరు ఇస్తే తీసుకున్నారా?... ఇలా మొత్తం 12 ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకుంటున్నారు. వీటి ఆధారంగా ఆయా సిబ్బందికి గ్రేడింగ్ ఇస్తున్నారు. ఇందులో వెనుకబడిన సిబ్బందికి అవసరమైన అంశాల్లో కౌన్సెలింగ్ ఇచ్చి వారి పనితీరు మెరుగుపరుస్తున్నారు. తీవ్రమైన ఆరోపణలు వస్తే మాత్రం విచారించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ రకమైన ఆరోపణలు వచ్చిన ఏడుగురిని ఉన్నతాధికారులు సీఏఆర్ హెడ్-క్వార్టర్స్‌కు ఎటాచ్ చేశారు.
పారదర్శకత కోసమే
‘ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, అవి నీతిని నిర్మూలించడంతో పాటు పోలీసు పనితీరు పూర్తి పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నాం. కాల్‌సెంటర్ ద్వారా అడిగే ప్రశ్నల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచుతూ... ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సిబ్బందికీ మెళకువలు నేర్పుతున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నాం’
- వై.నాగిరెడ్డి, అదనపు సీపీ, స్పెషల్ బ్రాంచ్