
పోస్టల్ సిబ్బందితో మాట్లాడుతున్న జోనల్ పోస్టుమాస్టర్ జనరల్ ఎలీషా
ఆమదాలవలస : పోస్టాఫీసుల ద్వారా పాస్‌పోర్టులు అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విజయవాడ జోనల్ పోçస్టుమాస్టర్ జనరల్(పీఎంజీ) ఎలీషా అన్నారు. ఆమదాలవలసలో నూతనంగా నిర్మిస్తున్న ప్రధాన తపాలా కార్యాలయాన్ని శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటిస్తూ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని పోస్ట్‌మాస్టర్ వాన శ్రీనివాసరావును సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 564 ప్రధాన తపాలా కార్యాలయాలు ఉన్నాయని, ప్రతి గ్రామంలో బ్రాంచ్ పోస్టాఫీస్ కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు.
స్థానికంగా పోస్టల్ ఏటీఎం ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లబ్ధి పొందే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి పోస్టల్ శాఖ అభివృద్ధికి తోడ్పడాలన్నారు.
ఇప్పటికే గ్రామాల్లో జీడీఎస్ ఉద్యోగుల ద్వారా సేవలు అందిస్తున్నామని, త్వరలోనే మరో 2000 మంది జీడీఎస్ సిబ్బందిని నియమించనున్నామని చెప్పారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డబ్ల్యూ నాగచైతన్య, ఎ.ఎస్‌ఆర్.ఆర్.నవీన్‌కుమార్ పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment